రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బద్వేలు: ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో అసమానతల విషయంలో భారత్ 129వ స్థానానికి పడిపోవడం ఆందోళనకరమని సిపిఎం నాయకులు అభిప్రాయపడ్డారు. రూపాయి పతనం, నిత్యావసరాల ధరల పెరుగుదలకు కేంద్రంలోని బిజెపి ఎన్.డి.ఏ. ప్రభుత్వాల విధానాలే కారణమని వారు విమర్శించారు. కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్విట్ ప్రోకో విధానంలో పనిచేస్తున్నాయని ఆరోపించారు.
2026 సెప్టెంబర్ ఆరవ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు బద్వేలు స్థానిక పెన్షన్ అసోసియేషన్ మీటింగ్ హాల్‌లో బద్వేలు పట్టణ ప్రజా సంఘాల సమావేశం కన్వీనర్ కే.శీను అధ్యక్షతన "శాస్త్రీయ రాజకీయ శిక్షణ తరగతులు" నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.చాంద్ బాషా, మహిళా సంఘం నాయకురాలు మోక్షమ్మ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.చిన్ని, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విభిన్న వంతులు, చేతివృత్తిదారులు, మహిళా నాయకులు, ఆవాజు, కెవిపిఎస్ కార్యకర్తలు తదితరులు శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు.
శిక్షణా తరగతులకు హాజరైన వారిని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచ మానవాభివృద్ధి సూచిక సర్వేల్లో భారతదేశం అసమానతల విషయంలో 129వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. దేశంలో రూపాయి విలువ పతనం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్రంలోని బిజెపి ఎన్.డి.ఏ. ప్రభుత్వాలు డాలర్ను తలకెత్తుకోవడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సంపదను కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వాల విధానాలు దేశ ప్రజల్లో తిరోగమన భావాలను ప్రోత్సహిస్తున్నాయని జి.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. దేవుడు అందరికీ దేవుడే అని చెప్పే భక్తి ఉద్యమాలను విస్మరించిన బిజెపి ప్రభుత్వం మైనార్టీలపై విషం చిమ్ముతోందని ఆయన విమర్శించారు. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా పాలన కొనసాగితే దేశ సమైక్యత, సమగ్రతలకు తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు.
భారత రాజ్యాంగ 73, 74వ సవరణల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పంచాయితీలకు నిధులు, విధులు లేకుండా చేసి నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ ఖర్చు తగ్గించి, భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు.
దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళల పార్లమెంటు ప్రాతినిధ్యం 78 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో 10 శాతానికి మించలేదని జి.చంద్రశేఖర్ తెలిపారు. పట్టణాల్లో స్వయం ఉపాధి, మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదరిక నిర్మూలన పథకాలను పాలక ప్రభుత్వాలే నిర్వీర్యం చేసి, రద్దు చేస్తున్నాయని ఆరోపించారు.
భూస్వామ్య వ్యవస్థలో దోపిడీ శక్తుల మోడల్ చట్టం అయిన మనుధర్మ శాస్త్రం తెచ్చిందే కుల వ్యవస్థ అని జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. వామపక్షాల బలమైన ఉమ్మడి ప్రజా ప్రతిఘటన ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఇ.రమణయ్య, మున్సిపల్ నాయకులు నాగేంద్రబాబు, శివ, కాంట్రాక్ట్ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి కొండయ్య, స్కీం వర్కర్ల నాయకురాలు సుభాషిని, విజయమ్మ, లీలావతి, మహిళా సంఘం నాయకురాలు బాలమ్మ, మస్తాన్ బి, సుబ్బలక్ష్మి, సావిత్రి, స్వప్న, మార్తమ్మ, రజక ఉతిదారుల సంఘం నాయకులు సుబ్బరాయుడు, శ్రీనివాసులు, శౌరి వాయిద్య కళాకారుల సంఘం నాయకులు సుబ్బరాయుడు, శివకృష్ణ, విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షుడు మోరా ప్రసాదు, కార్యదర్శి వెంకటపతి, వెంకటేశ్వర్లు, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు పెద్ద ఓబయ్య, వెంకటేశ్వర్లు, మద్దయ్య, లక్ష్మయ్య, తిరుపతి రామయ్య, కెవిపిఎస్ నాయకులు జకరయ్య, రాయప్ప, వెల్డింగ్ వర్కర్స్ నాయకులు మల్లికార్జున, కార్పెంటర్స్ సంఘం నాయకుడు దస్తగిరి, ఆవాజ్ నాయకులు అన్వర్ భాష, మస్తాన్, హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.













