రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ప్రజా ఉద్యమాలు ఆగవని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు తెలిపారు. బ్రహ్మం గారిమఠం ప్రాంతంలోని 5రోడ్ల సెంటర్ వద్ద ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్ పేరుతో ఓటర్లను తొలగించే నిర్ణయాన్ని రద్దు చేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్ను అక్రమ పద్ధతుల్లో ఎలక్షన్ కమిషనర్గా నియమించిందని ఆరోపించారు. బిజెపి సూచనల మేరకు ఎలక్షన్ కమిషన్ ఓటర్ జాబితాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, వ్యతిరేక ఓట్లను తగ్గించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తొలగించిన ఓట్లన్నీ విదేశాల నుంచి అక్రమంగా చొరబడి వచ్చిన వారివేనని ప్రజలను మభ్యపెట్టేలా బిజెపి ప్రచారం చేస్తోందని అన్నారు.
ఇటీవలి కాలంలో జరిగిన ఎనిమిది రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఇదే విధంగా బిజెపికి అనుకూలంగా పనిచేసిందని ఆంజనేయులు పేర్కొన్నారు. బెంగాల్లోని భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ నియోజకవర్గంలో 47,094 ఓట్లు తొలగించగా, ఆమె 15,102 ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. తమిళనాడులోని కోలట్టూరు నియోజకవర్గంలో 83,402 ఓట్లు తొలగించగా, స్టాలిన్ 8,597 ఓట్ల తేడాతో ఓడిపోయారని వివరించారు.

దేశవ్యాప్తంగా సర్ పేరుతో 13.85 కోట్ల ఓట్లు తొలగించారని ఆంజనేయులు అన్నారు. భారత రాజ్యాంగం వయోజనులందరికీ కల్పించిన ఓటు హక్కును కొందరికి మాత్రమే పరిమితం చేసేలా, అప్రజాస్వామిక పద్ధతుల్లో బిజెపి, ఎలక్షన్ కమిషన్ కలిసి వ్యవహరించడం చట్టరీత్యా నేరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని గద్దె దించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆంజనేయులు మండిపడ్డారు. సభలు పెట్టుకోవడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, నిరసన తెలపడం వంటి హక్కులను రాజ్యాంగం స్పష్టంగా కల్పించిందని గుర్తుచేశారు. ఢిల్లీలోను, దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ అక్రమాలను ప్రశ్నించిన, నిరసించిన వారిని బిజెపి ప్రభుత్వం అరెస్టులు చేయడం, నిర్బంధానికి గురి చేయడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని వ్యాఖ్యానించారు. ప్రజాతంత్ర వాదులంతా బిజెపి నిరంకుశత్వంపై నిరసన తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.శివకుమార్, వి.అన్వేష్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ అక్రమాలపై దేశమంతా గగ్గోలు పెడుతుంటే, రాష్ట్రంలోని టిడిపి, జనసేన, వైసీపీ వంటి పార్టీలు స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న ఈ పార్టీలు, కేంద్రంలో బిజెపికి వాంతపడటం సిగ్గుచేటని అన్నారు.
దేశంలో ఆధార్ కార్డు అన్ని గుర్తింపు అవసరాలకు ఉపయోగిస్తుంటే, ఓటు హక్కు విషయంలో దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని శివకుమార్, అన్వేష్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్లో జీవించి ఉన్న ఓటర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించడం, ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పాలకులే, రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
బిజెపి అండతో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రజాతంత్ర వాదులంతా బలపరచాలని, ప్రజా ఉద్యమాలపై నిర్బంధ కాండను ఖండించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి గండి సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీరయ్య, మండల అధ్యక్షులు హరి, షరీఫ్, జహంగీర్, లాజర్, రమనమ్మ, అజయ్, రాహుల్, వీరభద్రుడు, తమస్, చిన్నక్క, కళావతి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.













