బద్వేలు : ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో అసమానతల విషయంలో భారత్ 129వ స్థానానికి పడిపోయిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ విమర్శించారు. బద్వేలు పట్టణంలో ఆదివారం నిర్వహించిన "శాస్త్రీయ రాజకీయ శిక్షణ తరగతులు"లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బద్వేలు స్థానిక పెన్షన్ అసోసియేషన్ మీటింగ్ హాల్‌లో ఉదయం 10 గంటలకు బద్వేలు పట్టణ ప్రజా సంఘాల సమావేశం కన్వీనర్ కే.శీను అధ్యక్షతన శిక్షణా తరగతులు జరిగాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.చాంద్ బాషా, మహిళా సంఘం నాయకురాలు మోక్షమ్మ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.చిన్ని సహా వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చేతివృత్తిదారులు, మహిళా నాయకులు, ఆవాజు, కెవిపిఎస్ కార్యకర్తలు తదితరులు శిక్షణా తరగతులకు హాజరయ్యారు.

హాజరైన వారిని ఉద్దేశించి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రపంచ మానవాభివృద్ధి సూచిక సర్వేల్లో భారతదేశం అసమానతల్లో 129వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. దేశంలో రూపాయి విలువ పతనం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్రంలోని బిజెపి ఎన్.డి.ఏ. ప్రభుత్వాలు డాలర్ను తలకెత్తుకోవడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశ సంపదను కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్విట్ ప్రోకో పద్ధతిలో పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల్లో తిరోగమన భావాలు వ్యాప్తి చెందేలా ప్రభుత్వ విధానాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు.

దేవుడు అందరికీ దేవుడేనని చెప్పే భక్తి ఉద్యమాలను విస్మరించిన బిజెపి ప్రభుత్వం మైనార్టీలపై విషం చిమ్ముతోందని ఆయన విమర్శించారు. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా పాలన కొనసాగితే దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదమని హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు భారత రాజ్యాంగ సవరణ 73, 74 ప్రకారం జరగాలని, పంచాయితీలకు నిధులు, విధులు లేకుండా చేసి నిర్వీర్యం చేస్తున్నారని జి.చంద్రశేఖర్ అన్నారు. ప్రజల విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ ఖర్చు తగ్గించి, భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆయన విమర్శించారు.

దేశ జనాభాలో సుమారు 50 శాతం మహిళలే ఉన్నా, స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్లలో పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం 10 శాతానికి మించలేదని ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన పథకాలను పాలక ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు.

పట్టణాల్లో స్వయం ఉపాధి, మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వామ్య వ్యవస్థలో దోపిడీ శక్తుల మోడల్ చట్టం అయిన మనుధర్మ శాస్త్రం తెచ్చిందే కుల వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. వామపక్షాల బలమైన ఉమ్మడి ప్రజా ప్రతిఘటన ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమని జి.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఇ.రమణయ్య, మున్సిపల్ నాయకులు నాగేంద్రబాబు, శివ, కాంట్రాక్ట్ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి కొండయ్య, స్కీం వర్కర్ల నాయకురాలు సుభాషిని, విజయమ్మ, లీలావతి, మహిళా సంఘం నాయకురాలు బాలమ్మ, మస్తాన్ బి, సుబ్బలక్ష్మి, సావిత్రి, స్వప్న, మార్తమ్మ, రజక ఉతిదారుల సంఘం నాయకులు సుబ్బరాయుడు, శ్రీనివాసులు, శౌరి వాయిద్య కళాకారుల సంఘం నాయకులు సుబ్బరాయుడు, శివకృష్ణ, విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు మోరా ప్రసాదు, వెంకటపతి, వెంకటేశ్వర్లు, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు పెద్ద ఓబయ్య, వెంకటేశ్వర్లు, మద్దయ్య, లక్ష్మయ్య, తిరుపతి రామయ్య, కెవిపిఎస్ నాయకులు జకరయ్య, రాయప్ప, వెల్డింగ్ వర్కర్స్ నాయకులు మల్లికార్జున, కార్పెంటర్స్ సంఘం నాయకులు దస్తగిరి, ఆవాజ్ నాయకులు అన్వర్ భాష, మస్తాన్, హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.