రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బ్రహ్మంగారి మఠం మండలం లింగాలదిన్నె పల్లె ఎస్టీ కాలనీ వాసుల భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసైన్డ్ భూముల రక్షణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మంగళవారం బి.మఠం తహసిల్దార్ కార్యాలయం ముందు ఈ దీక్షలను ప్రారంభించారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి.శివకుమార్, జిల్లా కార్యదర్శి వి.అన్వేష్ రెవిన్యూ అధికారుల వైఖరిపై తీవ్రంగా విమర్శలు చేశారు. లింగాలదిన్నె పల్లె ఎస్టీ కాలనీ వాసులకు పలుగురాళ్లపల్లె రెవిన్యూ పొలంలోని 1938 సర్వే నంబరులో భూమి పంపిణీ చేసినప్పటికీ, ఇప్పుడు పేదలను సాగు చేయనివ్వకుండా నోటీసులు పంపడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1938 సర్వే నంబరులో లింగాలదిన్నె పల్లె ఎస్టీ, బిసి కులాలకు చెందిన భూమిలేని 74 మంది పేదలకు అసైన్డ్ మెంట్ కమిటీ నిర్ణయంతో పట్టాలు పంపిణీ చేసినట్లు, సబ్ డివిజన్ చేసి మ్యాపు గీసి, భూమి స్వాధీన పత్రాలు కూడా అందజేసినట్లు వారు గుర్తుచేశారు. ఈ భూముల్లో 14 సంవత్సరాలుగా పేదలు సాగు చేస్తూ ఉన్నారని తెలిపారు.
ఇలాంటి పరిస్థితిలో తాజాగా కొంతమంది కబ్జాదారులు వచ్చి పేదలను అడ్డుకుంటున్నప్పటికీ, వారి మీద కేసులు పెట్టి రక్షణ కల్పించాల్సిన రెవిన్యూ అధికారులు, బదులుగా పేదలకు నోటీసులు జారీ చేసి భూముల్లోకి దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
అదే సర్వే నంబరులో కొంతమంది రాజకీయ పలుకుబడి కలిగిన వారు పదుల ఎకరాలను ఆక్రమించి యథేచ్ఛగా పంటలు పండించుకుంటూ ఉన్నారని, వారిని అడ్డుకునే ధైర్యం రెవిన్యూ అధికారులకు లేదని ఆరోపించారు. కబ్జాదారుల నుంచి ఎన్ని లక్షల రూపాయల ముడుపులు అందాయో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
2011లో భూమి హద్దులు చూపి భూమి స్వాధీన పత్రాలు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా, భూములను ఆన్లైన్ చేయకుండా రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు విమర్శించారు. అధికారుల తప్పులకు పేదలు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
1938 సర్వే నంబరులో ఎస్టీ కాలనీ వాసులు అనుభవంలో ఉన్న భూములను వెంటనే వారి పేర్లపై ఆన్లైన్ చేయాలని, అదే సర్వే నంబరులో ఉన్న జోకుపల్లి, పలుగురాళ్లపల్లె గ్రామాలలోని అసైన్డ్ మెంట్ లబ్ధిదారుల DKT పట్టాల భూములకు హద్దులు చూపించాలని వారు డిమాండ్ చేశారు.
సమస్యను పరిష్కరించేంతవరకు దీక్షలను విరమించే ప్రసక్తే లేదని, అవసరమైతే రిలే నిరాహార దీక్షలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే రెవిన్యూ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సాన గోవిందస్వామి, ఉపాధ్యక్షుడు జి.సునీల్ కుమార్, అసైన్డ్ భూముల రక్షణ కమిటీ నాయకులు ఆంజనేయులు, వెంకట కృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మొదటి రోజు దీక్షల్లో కత్తి రవణమ్మ, వెంకట లక్ష్మమ్మ, కొండమ్మ, అనసూయమ్మ, వెంకటలక్ష్మమ్మలు పాల్గొని నిరాహార దీక్షలో కూర్చొన్నారు.













