రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: పోరుమామిళ్ల మండలంలో లిక్కర్ మాఫియా అడ్డగోలుగా చెలరేగిపోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ రూపంలో ఏర్పడిన లిక్కర్ డాన్లు మండలమంతా చక్రం తిప్పుతూ పేద ప్రజలు, కూలీలు, సామాన్యులను బహిరంగంగా దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్వార్టర్ బాటిల్‌పై 10 నుంచి 20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ, ఎం ఆర్ పి రేట్లను పూర్తిగా పక్కనబెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వినాయక చవితి పండుగను టార్గెట్‌గా చేసుకుని పేదవాడి ఆనందంలోకి, జీవనంలోకి దెయ్యంలా చొరబడుతున్న ఈ మాఫియా చర్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ప్రజా సంఘాలు, మీడియా ఈ మాఫియా దోపిడీని బహిర్గతం చేసి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బట్టలూడదీసి నిలబెట్టినా, లిక్కర్ డాన్లు మాత్రం ఏమాత్రం సిగ్గు పడకుండా తమ దోపిడీ కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది అవినీతి అధికారులు, అవినీతి విలేకరుల సహకారంతో వీరు యదేచ్ఛగా తమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రక్క మండలాలకు, జిల్లాలకు, ఆపై రాష్ట్రమంతా ఈ మాఫియా విస్తరించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధి కలిగిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఈ లిక్కర్ మాఫియాను కట్టడి చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ లిక్కర్ మాఫియా అల్లరిమూకల వల్ల విజయవంతంగా నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి అపకీర్తి వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠకు భంగం కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మంత్రి Lokesh, డిప్యూటీ సీఎం Pawan Kalyan ఈ లిక్కర్ మాఫియాపై కొరడా జులిపించి, తోకలు కత్తిరించాలని నిజమైన TDP అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, మందుబాబులు డిమాండ్ చేస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ధర్నాలు, రాస్తారోకోలు మొదలై ప్రభుత్వాన్ని ఎండగట్టే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అధికారులు, లిక్కర్ డాన్లు తస్మాత్ జాగ్రత్తగా ఉండి, చట్టబద్ధంగా మద్యం విక్రయాలు జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో లిక్కర్ మాఫియా దోపిడీకి అడ్డుకట్ట వేసే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు ఉధృతమవుతున్నాయి.













