రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.యస్.ఆర్. కడప జిల్లా బద్వేలు రూరల్ పరిధిలో రెండేళ్ల క్రితం మైనర్ బాలికపై అత్యాచారం చేసి, అనంతరం సజీవ దహనం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి కడప POCSO కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే నిందితుడికి రూ.8,000 జరిమానా కూడా విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు వై.యస్.ఆర్. కడప జిల్లా బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 231/2024గా నమోదు అయింది. BNS-2023 సెక్షన్లు 64, 103, 303(2), 238తో పాటు POCSO చట్టం-2012 సెక్షన్ 3 r/w 4 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారుల సమర్థవంతమైన దర్యాప్తు, సాంకేతిక ఆధారాల సేకరణ, పకడ్బందీ ప్రాసిక్యూషన్ ఫలితంగా నిందితుడిపై నేరం రుజువైంది.
కడప గౌరవ POCSO కోర్టు న్యాయమూర్తి శ్రీ ఎం.ఎ. సోమశేఖర్ BNSS సెక్షన్ 258(2) ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.8,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు వివరాల ప్రకారం, నిందితుడు జక్కల విగ్నేష్ అలియాస్ సాయి (19) ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.పి. కుంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం సజీవ దహనం చేసి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు అనంతరం మృతి చెందింది.
కేసు దర్యాప్తు అధికారిగా అప్పటి బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగభూషణం పనిచేశారు. ఆయన సాంకేతిక ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేశారు. నిందితుడిని 30 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి, పకడ్బందీగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
నిందితుడు జక్కల విగ్నేష్ అలియాస్ సాయి వయస్సు 19 సంవత్సరాలు. తండ్రి చంద్రశేఖర్. వృత్తి హోటల్ కుక్. స్వస్థలం రామాంజనేయ నగర్, బద్వేలు టౌన్. ప్రస్తుతం ఓంశాంతి నగర్, కడప సిటీలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన అప్పటి బద్వేలు రూరల్ సీఐ ఎం. నాగభూషణం, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడంతో పాటు సాక్ష్యాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. వేణుగోపాల్, బద్వేలు రూరల్ ప్రస్తుత సీఐ ఎన్. కృష్ణయ్య, కోర్టు మానిటరింగ్ ఏఎస్‌ఐ ఏ. నాగేంద్ర, పీసీ శ్రీనివాసులను జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ప్రత్యేకంగా అభినందించారు.
“మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. నేరం రుజువైతే చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా పకడ్బందీ దర్యాప్తు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది” అని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం, కడప.













