పోరుమామిళ్ల: స్థానిక పోరుమామిళ్లలోని సిపిఎం పూర్తి పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోరుమామిళ్లలో బ్రాందీ షాపులు, బెల్ట్ షాపుల దందాలపై సిపిఎం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్, సిఐటియు మండల అధ్యక్షుడు సోమయ్య సమావేశంలో మాట్లాడుతూ, పోరుమామిళ్లలోని బ్రాందీ షాపుల్లో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసే పేద ప్రజలు బ్రాందీ షాపులకు వెళ్లినప్పుడు, ఒక్క క్వార్టర్‌పై ఎమ్మార్పీ ధర కంటే అదనంగా పది రూపాయలు వసూలు చేసి వారి జేబులు ఖాళీ చేస్తున్నారని తెలిపారు.

ఈ అక్రమ వసూళ్ల గురించి ఎక్సైజ్ సిఐ సీతారామ రెడ్డి దృష్టికి వెళ్లినా, ఆయన పట్టించుకోకుండా బ్రాందీ షాపుల యజమానులతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటూ వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోరుమామిళ్లలో బ్రాందీ షాపుల దందాలు సిఐ చేతగాని పనికి నిదర్శనమని, దీనిపై ఎస్పీ, కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకుని ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

పోరుమామిళ్లలోని అన్ని బ్రాందీ షాపుల్లో క్వార్టర్‌కు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని, ఈ అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకుని ఆ బ్రాందీ షాపులను రద్దు చేయాలని వారు కోరారు.

అదే విధంగా పోరుమామిళ్ల మండలంలో 17 పంచాయతీలు ఉండగా, ప్రతి పంచాయతీలో ఊరు ఊరునా బెల్ట్ షాపులు బహిరంగంగా నడుస్తున్నాయని తెలిపారు. పండగ వాతావరణంలా బెల్ట్ షాపులు నడిపిస్తూ ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు స్వాహా చేస్తున్నారని, కష్టపడి సంపాదించిన డబ్బులు పూర్తిగా మద్యం కోసం వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, పేదలు, నిరుపేదలు, మద్దతు కుటుంబాలు కూడా మందుకు బానిసలైపోతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో ఒక్క క్వార్టర్‌పై 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నా, పోలీస్ యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చూస్తూ వున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడుతున్న వారి పై కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలు తీసుకుని పోరుమామిళ్లను ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలని వారు కోరారు.

తమ డిమాండ్లను పట్టించుకోకపోతే మహిళలతో, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున బ్రాందీ షాపులపై దాడులు నిర్వహించి, అనంతరం విస్తృత స్థాయిలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుందరయ్య, అలీ భాష, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.