రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: పోరుమామిళ్ల: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల ఆర్టీసీ బస్ స్టేషన్ పరిసరాల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా నెల రోజుల పాటు బస్టాండ్‌లోకి బస్సుల ప్రవేశాన్ని ఆర్టీసీ నిలిపివేసింది. దీంతో పట్టణంలోకి వచ్చే, వెళ్లే బస్సుల మార్గాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) ఆధ్వర్యంలో బస్ స్టేషన్ ప్రధాన రహదారి ముందు భాగంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కావడంతో, సుమారు నెల రోజుల పాటు బస్ స్టేషన్‌లోకి ఏ ఒక్క బస్సునూ అనుమతించబోమని ఆర్టీసీ బద్వేల్ డిపో మేనేజర్ కన్యా కుమారి తెలిపారు.
బద్వేల్, మైదుకూరు వైపు వెళ్లే సెక్టార్ బస్సులను అంబేద్కర్ సర్కిల్ మీదుగా మళ్లించి నడిపించనున్నారు. గిద్దలూరు, మార్కాపురం సెక్టార్ల నుంచి వచ్చే బస్సులను పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్దే నిలిపివేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. గిద్దలూరు, మార్కాపురం మార్గంలో వెళ్లే బస్సులు మాత్రం బస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా నేరుగా తమ గమ్యస్థానాలకు పయనిస్తాయని అధికారులు తెలిపారు.
ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా అంబేద్కర్ సర్కిల్ లేదా పోలీస్ స్టేషన్ వద్ద వేచి ఉండి బస్సులు ఎక్కాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
ఇక నెల రోజుల పాటు బస్ స్టేషన్‌లోకి బస్సులు రాకపోవడం చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. బస్టాండ్ ప్రాంగణంలో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ప్రయాణీకుల రాకపోకలు నిలిచిపోవడంతో తమ రోజువారీ ఆదాయం తీవ్రంగా తగ్గిపోతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గడవడం కూడా కష్టమవుతుందని వారు వాపోతున్నారు.
రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ఈ నెల రోజుల కాలంలో దుకాణాల అద్దెలను పూర్తిగా రద్దు చేసి తమను ఆదుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలంటూ వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బస్టాండ్ మూసివేతతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని, కనీసం ఈ కాలంలోనైనా అద్దె మాఫీ చేయడం ద్వారా ఉపశమనం కల్పించాలని వారు కోరుతున్నారు.













