రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, స్పటిక లింగం శివాలయం పరిసర ప్రాంతమైన సుందరయ్య కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కాలనీలో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడిరోడ్డుపై డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో పాచిపట్టి, రాకపోకలు కష్టసాధ్యమైందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 20 ఏళ్లుగా ఈ కాలనీలో ప్రజలు నివసిస్తూ మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కనీస మౌలిక వసతులు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. సుందరయ్య కాలనీ చుట్టుపక్కల ఉన్న ఇతర కాలనీలకు సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు మొత్తం సుందరయ్య కాలనీలోకే చేరుతోంది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి పాచిపట్టడంతో చిన్నారులు, వృద్ధులు, వాహనదారులు భయాందోళనతో ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
ప్రతి రోజు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఈ నిల్వ నీటిలో నడవక తప్పని పరిస్థితి ఏర్పడిందని, పలుమార్లు జారి పడిపోయి గాయపడిన సంఘటనలు చోటుచేసుకున్నాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిల్వ నీటి నుంచి దుర్వాసన వ్యాపించడం, దోమలు పెరగడం వల్ల దోమకాటుకు గురై జ్వరాలు వస్తున్నాయని కాలనీవాసులు అంటున్నారు.
ఇటీవల టిడిపి ఇన్‌చార్జ్ సూర్యనారాయణ రెడ్డి వార్డులో పర్యటించిన సందర్భంగా, కనీస మౌలిక వసతులు కల్పించాలని వార్డు ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ నిల్వ నీటిని తరలించడంలో కూడా మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా సుందరయ్య కాలనీలో కృష్ణవేసిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, కనీస మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలంటూ కాలనీవాసులైన పోతుగంటి నాగూర్ భాష, షేక్ ఖాజాబీ, షేక్ కరీమునిషా, షేక్ గౌస్యతో పాటు పలువురు నివాసితులు మున్సిపాలిటీని కోరుతున్నారు.













