బ్రహ్మంగారిమఠం మండల తహసీల్దార్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పేదలను వారి సొంత భూముల్లోకి దిగనీయకుండా అడ్డుకోవడంలో చూపుతున్న ఉత్సాహం, అదే మండలంలో భూకబ్జాదారులు చేస్తున్న అక్రమ ఆక్రమణలను అడ్డుకోవడంలో కనిపించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ ఆరోపించారు. తహసీల్దార్ చర్యలను నిరసిస్తూ సోమవారం చలో ఆర్డీవో కార్యాలయం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మండలంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శివకుమార్ విమర్శించారు. స్మశానంలోని మట్టిని ట్రాక్టర్లతో తోలుకుపోతున్నా, అదే స్మశానంలో కొంత స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టి, అక్కడున్న వాగును పూడ్చి ఆక్రమించినా, తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

రేకలకుంట రెవెన్యూ పొలంలో రెండు రోజులుగా కొండలను యంత్రాలతో చదును చేస్తున్నా, ఈ అక్రమ చర్యలపై స్పందన లేకపోవడం ప్రశ్నార్థకమని శివకుమార్ వ్యాఖ్యానించారు. పలుగురాళ్లపల్లె రెవెన్యూ పొలం 1938 సర్వే నంబర్‌లో ఇటీవలి కాలంలో దాదాపు 100 ఎకరాల భూమిని 4–5 మంది వ్యక్తులు కబ్జా చేసినా, అధికారుల నుంచి చర్యలు కనిపించలేదని ఆయన తెలిపారు.

చీటీపాయలో పేదలకు చెందాల్సిన భూములను కబ్జా చేసి బోర్లు వేసినా, కొండువారిపల్లి దగ్గర దాదాపు 50 ఎకరాల భూమిని ఆక్రమించినా, పాపిరెడ్డి పల్లె సమీపంలో పదుల ఎకరాల భూమిని ఆక్రమించినా, తహసీల్దార్ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని శివకుమార్ పేర్కొన్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి 8 గంటలైనా కబ్జాదారులు ఎందుకు ఉంటున్నారు, రికార్డుల తారుమారు వ్యవహారం అంత క్రింది స్థాయి అధికారులే చేస్తున్నారా అనే ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్న వారిని పలకరించే సమయం కూడా తహసీల్దార్‌కు లేదా అని ప్రశ్నించారు.

నరసన్నపల్లె పై భాగంలో విచ్చలవిడిగా యంత్రాలతో చదును చేస్తున్నా, ఆ అక్రమాలపై కూడా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని శివకుమార్ ఆరోపించారు. ఇదే విధంగా కొనసాగితే అక్రమదారుల భూముల్లో భూ పోరాటం తప్పదని హెచ్చరించారు.

ఐదవ రోజు దీక్షలను ఉద్దేశించి జి.శివకుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్, Assigned భూముల రక్షణ కమిటీ కన్వీనర్ ఆంజనేయులు, సభ్యులు వెంకటకృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.