బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఎరువులు, పురుగుమందుల దుకాణాలు, ప్రభుత్వ రేషన్ దుకాణాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల ఆహార పౌర సంబంధాల శాఖ విజెలెన్స్ కమిటీ సభ్యులు టి. చైతన్య పరిశీలించారు. దుకాణాల్లో ఎరువుల నిల్వలు, ధరల పట్టికలు, విక్రయ రికార్డులను ఆయన పరిశీలించారు.

దుకాణాల్లో నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు మాత్రమే నిల్వ ఉంచి, నిర్ణీత ధరలకు విక్రయించాలన్న అంశంపై టి. చైతన్య దుకాణదారులకు సూచనలు చేశారు. అధిక ధరలు వసూలు చేసే పరిస్థితుల్లో సంబంధిత వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే దిశగా విజిలెన్స్ కమిటీ తనిఖీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

తదుపరి మండల తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను టి. చైతన్య కలిసి, మండల పరిధిలోని ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో ప్రజలకు సరైన కొలతలతో, నిర్ణీత సమయంలో రేషన్ సరుకులు పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. రేషన్ డీలర్లకు ఈ మేరకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని అధికారులను ఆయన అభ్యర్థించారు.

ఆ తరువాత నరసనపల్లె ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని టి. చైతన్య ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి రేషన్ సరుకుల పంపిణీ పరిస్థితులు, కొలతల వ్యవస్థ, అందుబాటు గురించి వివరాలు తెలుసుకున్నారు. రేషన్ సరుకుల కొలతల్లో తేడాలు ఉన్నా, పంపిణీలో ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

ప్రజలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు ఎలాంటి అంతరాయం లేకుండా, సక్రమంగా చేరేలా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని టి. చైతన్య పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించినట్లు సమాచారం.