రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు:- వరకట్నం కోసం భార్యను వేధిస్తున్న కేసులో పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిన కొన్ని గంటల్లోనే భర్త ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముద్దనూరు మండలంలో కలకలం రేపింది. అదనపు వరకట్నం కోసం భార్యపై దాడి చేసి, చంపడానికి కూడా వెనకాడలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముద్దనూరు మండలం నల్లబల్లె గ్రామానికి చెందిన ఉదయ్‌కు, ఏడాదిన్నర క్రితం థర్రల్ గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులకు ఎనిమిది నెలల పాప పుట్టింది. ఇదిలా ఉండగా, అదనపు వరకట్నం తీసుకురావాలని ఉదయ్ తన భార్యపై ఒత్తిడి పెంచుతూ, మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
భర్త వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సోమవారం ముద్దనూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇరువర్గాల పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ అనంతరం ఇరువురి మధ్య రాజీ కుదిరింది. భర్త ఉదయ్, ఇకపై భార్యను బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
రాజీ తర్వాత ఉదయ్ తన భార్యను ద్విచక్ర వాహనంపై నల్లబల్లె గ్రామానికి తీసుకెళ్తూ వస్తుండగా, మార్గమధ్యంలో ఆమెపై దాడికి దిగి హత్యాయత్నం చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. భార్యను తీవ్రంగా కొట్టి, ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన సమయంలో బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానికులు మధ్యలో జోక్యం చేసుకుని, ఉదయ్ బారి నుంచి బాధితురాలిని రక్షించారు. దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై ముద్దనూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. వరకట్న వేధింపుల కేసులో రాజీ కుదిరిన తర్వాతే హత్యాయత్నం జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.













