రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు పట్టణంలో స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా DYFI ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రాంగణంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ మాట్లాడుతూ పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు భగత్ సింగ్ స్పూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే పట్టణంలో భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని శివకుమార్ విమర్శించారు. కేంద్రం రాష్ట్ర విభజన సమయంలో కడప ఉక్కు పరిశ్రమ స్థాపన ప్రధాన హామీలలో ఒకటిగా ప్రకటించినప్పటికీ, ఇంతకాలం జరిగిన పార్లమెంటు సమావేశాలలో ఒక్క రూపాయి కూడా కడప ఉక్కు కోసం కేటాయించలేదని ఆయన ఆరోపించారు.
కడప ఉక్కు అంశంపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో కనీసం చర్చ కూడా చేయకపోవడం సిగ్గుచేటు విషయమని శివకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని ఎన్నికల సమయంలో చెప్పి, ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన అన్నారు.
పట్టణంలోని యువతకు స్పూర్తినిచ్చే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలుకు యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సుబహాన్, పట్టణ ఉపాధ్యక్షులు మహేష్, ఆజాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













