కడప జిల్లా, జమ్మలమడుగు:- వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా పశుసంవర్ధక రంగం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో జమ్మలమడుగులోని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. వీరబ్రహ్మయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డా. శ్రీధర్ రెడ్డి పాల్గొని రైతులు, పారా వెట్స్‌కు దిశానిర్దేశం చేశారు.

ఎల్‌నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పశువుల్లో వేడి ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని, దీనివల్ల మేత తీసుకోవడం తగ్గి పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ వివరించారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పాడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పాడి షెడ్లలో ధారాళంగా గాలి ప్రసరణ ఉండేలా చూడాలని, పశువులకు తగినంత నీడ కల్పించాలని, రోజంతా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని నిపుణులు రైతులకు సూచించారు. పచ్చిమేత కొరతను ముందుగానే అంచనా వేసి సైలేజ్, ఎండుగడ్డి నిల్వ చేసుకోవడంతో పాటు తక్కువ నీటితో పండే పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని తెలిపారు.

పశువులకు సమతుల్య దాణా, ఖనిజ లవణాల మిశ్రమం అందించడం ద్వారా వాటి రోగనిరోధక శక్తిని కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ కోఆర్డినేటర్ డా. డి. ఇందిర (ఎల్‌పీఎం విభాగం) పశువుల యాజమాన్య పద్ధతులు, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు వివరించారు.

కళాశాల అధ్యాపకులు డా. జ్యోతి, డా. సాయి కృష్ణ, డా. చరిత, డా. జాన్, డా. గాయత్రి, డా. మంజుల పశువుల పునరుత్పత్తి, పరాన్నజీవుల నివారణ, వ్యాధుల చికిత్స విధానాలపై సమగ్ర సమాచారాన్ని అందించారు. పశువుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదా వేడి ఒత్తిడి లక్షణాలు కనిపించినా వెంటనే పశువైద్యులను సంప్రదించాలని, ముందస్తు ప్రణాళికతోనే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సదస్సులో నిపుణులు పిలుపునిచ్చారు.