రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు పంచాయతీరాజ్ శాఖలో భారీ స్థాయిలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించి నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్ బాబు తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
రూ.8.56 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అవకతవకల కేసులో జమ్మలమడుగు పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాంసుందర్ రాజు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సుధాకర్, టైపిస్టు భాస్కర్, కాంట్రాక్టు ఉద్యోగి షాహిర్ హుస్సేన్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్ బాబు వివరించారు.
జమ్మలమడుగు పంచాయతీరాజ్ డివిజన్లో 2022 జూలై 1 నుంచి 2025 మే 31 మధ్యకాలంలో ప్రభుత్వ నిధుల లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు శాఖాపరమైన విచారణలో బయటపడినట్టు తెలిపారు. పనుల చెల్లింపులకు సంబంధం లేని లావాదేవీలు జరగడం, రికార్డుల్లో అక్రమ మార్పులు చేయడం, వివిధ బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేయడం వంటి అంశాలు విచారణలో తేలినట్టు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 25న జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. అనంతరం దర్యాప్తు భాగంగా సంబంధిత అధికారులను విచారించడం, ప్రభుత్వ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి పరిశీలించినట్టు వివరించారు.
ప్రాథమిక ఆధారాల ఆధారంగా నలుగురు నిందితులను అక్టోబర్ 15న జమ్మలమడుగు తాడిపత్రి బైపాస్ రోడ్డులోని రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్టు సీఐ నరేష్ బాబు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులపై సంబంధిత నేర విభాగాల కింద కేసులు నమోదు చేసి, న్యాయ ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నిధుల లావాదేవీలు, ఇతర బ్యాంకు ఖాతాలు, లబ్ధిదారుల వివరాలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీఐ నరేష్ బాబు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తేలితే, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.













