సహజ పద్ధతులతోనే దోమల నియంత్రణకు ప్రయత్నించాలి: అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ రామవిజయారెడ్డి

చాపాడు మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో దోమల ద్వారా వ్యాపించే అంటువ్యాధుల నివారణపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నక్కలదిన్నె బిసి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ రామవిజయారెడ్డి ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు, వైద్య సేవల వినియోగంపై సూచనలు చేశారు.

నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పి.ఓబులేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత కాలంలో దోమల బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వీటిని అరికట్టేందుకు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరించాలని రామవిజయారెడ్డి ప్రజలకు వివరించారు. మార్కెట్లో లభించే కెమికల్ కాయిల్స్, లిక్విడ్స్ వాడకం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, వీలైనంతవరకు వాటి వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

దోమలను తరిమేందుకు ఇంట్లోనే సులభంగా అమలు చేయగల పద్ధతుల గురించి ఆయన వివరించారు. ఒక ప్రేమిదలో కొద్దిగా వేప నూనె పోసి, అందులో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి వెలిగిస్తే, దాని నుండి వచ్చే పొగ వాసనకు దోమలు, ఈగలు నిమిషాల్లో ఇల్లు వదిలి పారిపోతాయని తెలిపారు. అలాగే నిమ్మకాయను మధ్యలో కోసి, ఆ రెండు చెక్కలలో లవంగాలను గుచ్చి హాల్, బెడ్‌రూమ్‌ల మూలల్లో ఉంచితే నిమ్మ–లవంగ మిశ్రమ ఘాటు వాసనను దోమలు భరించలేక ఆ ప్రాంతం నుంచి దూరం అవుతాయని వివరించారు.

ఒక స్ప్రే బాటిల్‌లో నీరు తీసుకుని, అందులో కొన్ని చుక్కలు పెప్పెర్మింట్ పుదీన నూనె లేదా Eucalyptus ఆయిల్ (నీలగిరి తైలం) కలిపి, ఈ మిశ్రమాన్ని ఇల్లంతా ముఖ్యంగా కిటికీలు, తలుపుల దగ్గర స్ప్రే చేస్తే ఆ వాసనకు కీటకాలు, దోమలు, ఈగలు రావని అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ రామవిజయారెడ్డి తెలిపారు.

అనంతరం వైద్యాధికారి డాక్టర్ పి.ఓబులేసు ప్రజలను ఉద్దేశించి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లకుండా, గ్రామంలోనే ఉన్న ఆసుపత్రికి వచ్చి చికిత్సలు పొందాలని సూచించారు. అన్ని రకాల వ్యాక్సిన్‌లు, మందులు, సూదులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని ఆయన ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో Sub Unit Officer సాధు శ్రీనివాసులు, ఆరోగ్య విస్తరణ అధికారి యం.రాఘవయ్య, Supervisor ప్రసాద్, MLHP కీర్తి, ANM ఆరోగ్య మేరీ, ASHA కార్యకర్త పోతులూరమ్మతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.