రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు: జిల్లాలోని ప్రధాన నదుల్లో ఇసుక తవ్వకాలపై అమల్లో ఉన్న నిషేధం కాగితాలకే పరిమితమవుతున్నదనే పరిస్థితి నెలకొంది. పర్యావరణ పరిరక్షణతో పాటు వర్షాకాలం దృష్ట్యా అక్టోబర్ 15 వరకు ఇసుక రీచుల్లో ఎలాంటి తవ్వకాలు జరపరాదని జిల్లా కలెక్టర్, గనుల శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం విరుద్ధ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లోని పెన్నా నదిని ఇసుక అసురులు చేరబట్టి యథేచ్ఛగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఇళ్లు నిర్మించుకునే వారు లేదా చిన్నపాటి పనులకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించుకోవచ్చని అధికారులు ఇచ్చిన మినహాయింపులను ఇసుక మాఫియా ఆసరాగా తీసుకుంటోంది.

జమ్మలమడుగు నుంచి పొన్నతోట, ముద్దనూరు వెళ్లే దారిలోని పెన్నా వంతెన సమీపంలో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. స్థానిక అవసరాల పరిమితిని దాటి ఈ ఇసుక పొరుగు జిల్లాలకు సైతం చేరుతోంది. నిషేధాజ్ఞలను ఏమాత్రం లెక్కచేయకుండా పెన్నా ఇసుకను కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని నోస్సం, శిరివెళ్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
పక్క జిల్లాల్లో ఒక్కో ట్రాక్టర్ ఇసుకను దాదాపు రూ.7,000 నుండి రూ.7,500 వరకు విక్రయిస్తూ భారీ దందా సాగిస్తున్నారు. ముద్దనూరు రోడ్డులోని పెన్నా వంతెన వద్ద ఇసుక తవ్వకాలు పూర్తిగా నిషేధించినప్పటికీ, ఇసుక వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ తవ్వకాల వల్ల నదీ గర్భంలో ఏర్పడుతున్న భారీ గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలో ఇలాంటి ఇసుక గుంతల్లో మునిగి పలువురు యువకులు మృత్యువాత పడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. నదీ ప్రవాహం మార్పు, గుంతల లోతు పెరగడం వల్ల స్నానానికి, వినోదానికి వెళ్లే యువత ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు.
ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి, పెన్నా నదిలో ఇసుక తవ్వకాలను పూర్తిగా నియంత్రించేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.













