రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ముద్దనూరు మండలంలోని వేల్పుచర్ల గ్రామంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మంగళవారం మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి నిర్వహించారు. గ్రామంలోని రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రబీ సీజన్ పంటల సాగు, అవసరమైన ఏర్పాట్లపై ఆయన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ రబీ పంటల సాగుకు రైతులు ముందస్తు ప్రణాళికతో సమాయత్తం కావాలని సూచించారు. రైతులకు అవసరమైన DAP, యూరియా ఎరువులు మండలంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటల నమోదు పూర్తయ్యిన తర్వాత రైతులు తప్పనిసరిగా KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పకృతి వ్యవసాయ సిబ్బంది కార్యక్రమంలో భాగంగా ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని ప్రదర్శన రూపంలో రైతులకు చూపించారు. విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి చేయడం అత్యంత అవసరమని, దీనివల్ల వ్యాధులు, పురుగుల దాడి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. పకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని రైతులకు తెలియజేశారు.
తదుపరి గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి పరిశీలించారు. పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలని, సమయానికి కలుపు నియంత్రణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఎరువుల యాజమాన్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేయాలని, పంట అవసరానికి అనుగుణంగా ఎరువుల వినియోగం చేయాలని ఆయన రైతులకు సలహా ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు రెడ్డి భాష, పకృతి వ్యవసాయ సిబ్బంది రామ సుధ, శైలజ, నాగ పావని, నాగ లక్ష్మీ దేవి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రైతులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పకృతి వ్యవసాయం, రబీ పంటల నిర్వహణపై అధికారులు ఇచ్చిన సూచనలు, సాంకేతిక వివరాలను తెలుసుకున్నారు.













