కడప జిల్లా మైలవరం మండలం వేపరాల సమీపంలో పెన్నానదిలో జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. అత్తను కాపాడేందుకు నీటిలోకి దూకిన అల్లుడు మృతి చెందగా, అత్త గల్లంతైంది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన కల్యాణ్‌ కుమార్‌ (25)కు మైలవరం మండలం తొర్రివేములకు చెందిన మానసతో నెల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం కల్యాణ్‌ కుమార్‌ భార్య ఇంటికి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వేపరాల సమీపంలోని పెన్నానది వద్దకు విహారయాత్రకు వెళ్లారు.

ఈ క్రమంలో మానస పిన్ని వెంగమ్మ (45), ఆమె మనవరాలితో కలిసి నదిలోకి దిగారు. అక్కడ లోతైన గుంతలు ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో పక్కనే దుస్తులు ఉతుకుతున్న ఒక వ్యక్తి అప్రమత్తమై, చీర సాయంతో వెంగమ్మ మనవరాలిని బయటకు తీశాడు.

మనవరాలిని కాపాడిన తర్వాత ఇంకా నీటిలో తల్లడిల్లుతున్న వెంగమ్మను రక్షించేందుకు కల్యాణ్‌ కుమార్‌ ముందుకు దూసుకెళ్లాడు. అయితే కల్యాణ్‌కు ఈత రాకపోవడంతో, వెంగమ్మను బయటకు తీశే ప్రయత్నంలో ఇద్దరూ లోతైన నీటిలో మునిగిపోయారు. అక్కడున్న ఇతరులు ప్రయత్నించినప్పటికీ వారిని వెంటనే బయటకు తీయలేకపోయారు.

సమాచారం అందుకున్న స్థానికులు, బంధువులు గాలింపు చర్యలు ప్రారంభించగా, కొద్దిసేపటికే కల్యాణ్‌ కుమార్‌ మృతదేహం లభ్యమైంది. అయితే వెంగమ్మ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో అధికారులు, బంధువులు, గ్రామస్థులు కలిసి నదిలో గాలింపు కొనసాగించారు.

సాయంత్రం నుంచి రాత్రి వరకు గాలించినా వెంగమ్మను గుర్తించలేకపోయారు. చీకటి ముసురుకోవడంతో గాలింపు చర్యలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. సోమవారం ఉదయం మళ్లీ గాలింపు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జమ్మలమడుగు డీఎస్పీ వెంటేశ్వరరావు, మైలవరం ఎస్సై శ్యాంసుందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కల్యాణ్‌ కుమార్‌ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కల్యాణ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్తను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన అల్లుడు మృతి చెందడం, అత్త గల్లంతవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.