రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఐద్వా కడప జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. అధిక ధరల వ్యతిరేక నిరసనకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం కడపలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఐద్వా కడప జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, జిల్లా అధ్యక్షురాలు సుబ్బమ్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లోనే అనేక సరుకుల ధరలు 40 నుండి 70 శాతం వరకు పెరిగినట్టు వివరించారు.

బియ్యం, పప్పు ధాన్యాలు, పంచదార, ఎండుమిర్చి, ఉల్లి, నూనె ధరలతో పాటు గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు కూడా నిరంతరం పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. మార్కెట్లో సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ధరల పెరుగుదలతో సాధారణ కుటుంబాలపై తీవ్రమైన భారం పడుతోందని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు పౌష్టికాహారానికి దూరమవుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసరాల కొనుగోలులోనే కష్టాలు పడుతున్నాయని తెలిపారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు కారణమైన అంశాలను గుర్తించి, అవసరమైన చోట సబ్సిడీలు, సరఫరా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని సూచించారు.
అధిక ధరల వ్యతిరేకంగా ఈ నెల 7న నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ముంతాజ్ బేగం, సుబ్బమ్మ పిలుపునిచ్చారు. ధరల నియంత్రణ కోసం ఐద్వా చేపడుతున్న పోరాటానికి మహిళలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, జిల్లా అధ్యక్షురాలు సుబ్బమ్మ, కోశాధికారి బి.లక్ష్మీదేవి, టౌన్ కమిటీ హామీల ఉపాధ్యక్షురాలు ఎస్.గోసియా, శంషాద్, లతీఫ్, అనంతమ్మా, బీబీ, మోక్షమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.













