రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైఎస్ఆర్ జిల్లా, కడపలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితా అంశాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ 3న ప్రచురితమయ్యే నూతన ఎలక్టోరల్ రోల్ ఆధారంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని YSRCP తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అంజాద్ బాషా కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు YSRCP శ్రేణులు, కార్యకర్తలు పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన మరియు పారదర్శకమైన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియలో సుమారు 45 లక్షల ఓట్లు తొలగించారని, మరో 42 లక్షల మందికి నోటీసులు జారీ చేశారని YSRCP నేతలు ఆరోపించిన విషయాన్ని అంజాద్ బాషా ప్రస్తావించారు. తొలగించిన ఓట్లలో సుమారు 15.25 లక్షల వరకు మరణించిన వారి ఓట్లు, 7.50 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని తెలిపారు.
కడప నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. గతంలో సుమారు 2.87 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య SIR అనంతరం 2.17 లక్షలకు పడిపోయిందని, సుమారు 67 వేల ఓట్లు తొలగించారని, అలాగే 77 వేల మందికి నోటీసులు ఇచ్చారని అంజాద్ బాషా వెల్లడించారు.
భారీగా ఓట్ల తొలగింపుతో డివిజన్లు, స్థానిక వార్డుల రిజర్వేషన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని అంజాద్ బాషా అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి YSRCP విజ్ఞప్తి చేసినట్లు అంజాద్ బాషా తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటా కృష్ణ, నార్త్ జోన్ మండల అధ్యక్షులు బిహెచ్ఇలియాజ్, జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బసవరాజు, మహమ్మద్ షఫీ, అజ్మతుల్లా ఖాన్, నగర మేధావుల వివాదం ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.













