గాంధీ జయంతి సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెల దినం: పెండింగ్ సమస్యల పరిష్కారంపై APUWJ డిమాండ్

కడప: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీని “వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెల దినం”గా పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో కడపలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సాయంత్రం జర్నలిస్టుల ప్రతినిధులు డిఆర్ఓ మల్లికార్జునుడిని కలిసి, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

వర్కింగ్ జర్నలిస్టులు, మీడియా సంస్థలకు సంబంధించి దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని APUWJ కోరింది. ప్రస్తుత మీడియా రంగంలో వచ్చిన సాంకేతిక, సామాజిక మార్పులను సమగ్రంగా సమీక్షించి వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది.

జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, మీడియా సంస్థలకు భద్రత కల్పించే విధంగా ప్రత్యేక కేంద్ర జర్నలిస్టుల భద్రతా చట్టం తీసుకురావాలని, వర్కింగ్ జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులు, రక్షణలను పునరుద్ధరించాలని APUWJ కోరింది. 1955, 1958 చట్టాల ద్వారా కల్పించిన ప్రత్యేక రక్షణలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ స్పష్టం చేసింది.

ప్రింట్, బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ మీడియా ఉద్యోగులకు ప్రస్తుత జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలను నిర్ణయించేందుకు నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ (WJHS) సమర్థవంతంగా అమలు చేసేందుకు జర్నలిస్టు ప్రతినిధులు భాగస్వాములుగా ఉండే త్రైపాక్షిక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ పథకాన్ని పునఃప్రారంభించాలని యూనియన్ కోరింది.

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి, ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పింఛన్ సౌకర్యం కల్పించాలి, గతంలో జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలనే అంశాలను కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు.

స్వేచ్ఛాయుతమైన, క్రియాశీలమైన, ఆర్థిక భద్రత కలిగిన పత్రికారంగం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని APUWJ పేర్కొంది. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ కోరింది.

కార్యక్రమంలో APUWJ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామసుబ్బారెడ్డి, శ్రీనివాస్ వెన్ను, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెంకటరెడ్డి, YSR మెమోరియల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీనాథ్ రెడ్డి, ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షుడు రమణారెడ్డి, IJU నాయకుడు రామాంజనేయ రెడ్డి, APUWJ సీనియర్ నాయకులు శివరాం, స్టాఫ్ రిపోర్టర్లు, కెమెరామెన్లు తదితరులు పాల్గొన్నారు.