రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరిగిన హత్యల కేసుల్లో ఇప్పటికీ న్యాయం జరగలేదని, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రొద్దుటూరు అసెంబ్లీ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు యామవరం కిరణ్ పాల్గొని, రాష్ట్రంలో జరిగిన 27 మంది దళితుల హత్యలపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగిన 27 దళితుల హత్యల కేసుల్లో ఇప్పటి వరకు బాధ్యులపై సరైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని బహుజన సమాజ్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. ఆ పిలుపు భాగంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుడిసెనపల్లి ఓబయ్య హాజరయ్యారు. జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దళితులపై జరుగుతున్న దాడులు, హత్యల ఘటనలను ఖండిస్తూ నినాదాలు చేశారు. దళితులపై దాడులు, హత్యల కేసులను ప్రత్యేకంగా పరిగణించి వేగంగా విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా BSP జిల్లా అధ్యక్షులు సగిలి, జిల్లా ఇన్‌చార్జ్ తీర్ల రవికుమార్ తదితరులు కలిసి జిల్లా రెవెన్యూ అధికారి (DRO)కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసును వేగంగా విచారించి బాధ్యులను శిక్షించాలనే అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు.
ధర్నా ముగింపు సమయంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు "జై భీమ్", "జై భారత్", "జై BSP" నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. దళితుల హక్కుల పరిరక్షణ, భద్రత కోసం బహుజన సమాజ్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు.













