కడప పట్టణంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, స్త్రీ శక్తి పథకం అమలులో ఉన్న లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సావిత్రి, జిల్లా నాయకులు, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సావిత్రి, మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అమలులో వచ్చిన మార్పుల వల్ల ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సుల సంఖ్యను పెంచాల్సిన సమయంలో, అందుకు విరుద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా 900 బస్సులను తగ్గించడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్త్రీ శక్తి పథకమే కారణమన్నట్లుగా ప్రచారం చేయడం అన్యాయమని ఆమె అభిప్రాయపడారు.

అనేక ప్రాంతాలలో బస్ స్టాప్‌లను తగ్గించడం, స్టాప్‌ల వద్ద బస్సులు నిలపకపోవడం, మహిళా ప్రయాణికుల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడం కొనసాగుతున్నాయని వి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బస్ స్టాప్‌ల వద్ద తప్పనిసరిగా బస్సులు నిలిపేలా చూడాలని, మహిళా ప్రయాణికుల గౌరవానికి భంగం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు.

బస్టాండ్లలో ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడం, చంటి పిల్లలకు పాలు ఇచ్చే గదులు, ప్రధమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. బస్టాండ్లలో తినుబండారాలు, వాటర్ బాటిల్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరారు.

ఈ డిమాండ్లన్నింటినీ వివరించే వినతిపత్రాన్ని ఐద్వా ప్రతినిధులు కడప ఆర్టీసీ డిఎం గారికి సమర్పించారు. డిఎం గారు సానుకూలంగా స్పందించి, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైన మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఐద్వా నాయకులు తెలిపారు.

ధర్నా కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐఎన్ సుబ్బమ్మ, ఎస్ ముంతాజ్ బేగం, జిల్లా నాయకురాలు జమీల కామేశ్వరమ్మ, శంషాద్, విజయలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, మేరీ బేబీ, లక్ష్మీదేవి, అమెజాన్ లతీప, ప్రేమ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనకు సంఘీభావంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రామ్మోహన్, వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు రెడ్డి, చంద్రారెడ్డి, గోపి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి రవి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రఘు, జితేంద్ర తదితరులు హాజరయ్యారు.