రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా కాశి నాయన మండలం అమగంపల్లె సమీపంలో కారు–బైక్ ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాలుడు కాశి నాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన కొప్పోలు శ్రీనివాస్ రెడ్డి, లత దంపతుల రెండో కుమారుడు సురేంద్ర రెడ్డి (14) గా గుర్తించారు.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం సురేంద్ర రెడ్డి ప్రస్తుతం 9వ తరగతి చదువుకుంటున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతడు బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఢీకొన్న వెంటనే కారు అక్కడే నిలిచిపోయినప్పటికీ, కారు డ్రైవర్ మాత్రం వాహనాన్ని సంఘటనా స్థలంలో వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన సురేంద్ర రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పిన్న వయసులోనే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గిద్దలూరు నుండి మైదుకూరు వైపు వెళుతున్న ఏపీ 39 JU 1836 నంబర్ కారు ఈ ప్రమాదంలో పాల్గొన్న వాహనంగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న కాశి నాయన మండలం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు, బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కారు డ్రైవర్ పరారీలో ఉండడంతో అతడి గుర్తింపు, అరెస్టు కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, నిర్లక్ష్యం ఎవరివైపు ఉందన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.













