రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 10న, అలాగే దేశవ్యాప్తంగా నిర్వహించనున్న శాంతియుత నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీవ్ర నిర్బంధ చర్యలను వామపక్ష పార్టీలు ఖండించాయి. SIR ప్రక్రియ పేరుతో ఓటర్ల పేర్లను భారీ స్థాయిలో తొలగించడం, దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆదివారం కడప నగరంలోని ఓంశాంతి నగర్లో ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫార్వర్డ్ Bloc పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయుడు, CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అంకన్న, బహుజన్ JAC అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో SIR ప్రక్రియ ద్వారా ఓటర్ల పేర్ల తొలగింపును నిరసిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకుంటున్న విద్యార్థులను రైళ్ల నుంచి బలవంతంగా దించివేయడం, మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడం, భారీగా పోలీసు బలగాలను మోహరించడం, వేలాది మంది విద్యార్థులు, యువజన నాయకులను నిర్బంధించడం వంటి చర్యలు ప్రజాస్వామిక హక్కులపై ప్రత్యక్ష దాడిగా వారు అభివర్ణించారు.
అదేవిధంగా, విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై కూడా నిర్బంధం ప్రయోగించడం, అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు చర్యలని నాయకులు పేర్కొన్నారు. శాంతియుత నిరసన తెలిపే హక్కును కాలరాయడం ద్వారా ప్రజల గొంతును అణచివేయాలనే ప్రయత్నం జరుగుతోందని వారు విమర్శించారు.
SIR ప్రక్రియ పేరుతో కోట్లాది మంది ఓటర్ల పేర్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ తొలగింపుల వల్ల ఏర్పడిన పరిస్థితులకు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని నాయకులు కోరారు.
ఎలక్షన్ కమిషన్ పనితీరు, ఓటర్ల జాబితాలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సుప్రీమ్ కోర్ట్ సమగ్ర విచారణ జరపాలని వారు అభ్యర్థించారు. నిర్బంధించిన విద్యార్థులు, యువజన నాయకులందరినీ తక్షణమే విడుదల చేయాలని, వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో నాయకులు రాజేంద్ర ప్రసాద్, గోపి, హరి పాల్గొన్నారు.













