రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప, కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న జిల్లా వ్యాప్తంగా ఆల్ పార్టీ నిరసనలు నిర్వహించనున్నట్లు వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా మారాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల వ్యవస్థను వక్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు.
బుధవారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక "ప్రెస్ క్లబ్"లో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అధ్యక్షతన "రౌండ్ టేబుల్ సమావేశం" జరిగింది. సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ నర్సింగరావు సమావేశాన్ని ప్రారంభించి, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రవర్తనపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు.
2026 అక్టోబర్ 2వ తేదీ దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ, సీఈసీ రాజీనామా చేయాలని 30 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిరసన ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. కడప జిల్లాలో కూడా బిజెపి యేతర పార్టీలు, వామపక్షా పార్టీలు, ప్రజాసంఘాలు ఉమ్మడిగా ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయని తెలిపారు.
నేటి కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రజాస్వామ్యంపై దాడి చేసే చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ను ప్రణాళిక బద్ధంగా, కుట్రపూరితంగా బలహీనపరిచారన్నారు.
బిజెపి గెలవడానికి, ప్రతిపక్ష పార్టీలు ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా పౌరుల్లో ఓటు ఉన్న పౌరులు, ఓటు లేని పౌరులుగా విభజించడమే కారణం అన్నారు. బిజెపి గెలవడానికి ఎన్నికల కమిషన్ ఎలక్ట్రోరల్ రిగ్గింగ్ కు పాల్పడుతోందని, సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకుంటుందని తేటతెల్లమవుతుందన్నారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన పరిశోదాత్మక వ్యాసం కాదని, కేంద్ర ఎన్నికల కమిషన్ లోని వారే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తీసుకుంటున్న రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను భరించలేక లీక్ చేశారన్నారు.
ఎన్నికల కమిషన్‌లో మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పక్కన పెట్టి, బిజెపి సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే పార్లమెంట్‌లో అభిశంషనా తీర్మానం తీసుకువచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
గత 12 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలపై తీవ్ర భారం మోపాయని, ముఖ్యంగా మహిళల్లో బిజెపి వ్యతిరేకత పెరుగుతోందని సమావేశంలో పేర్కొన్నారు. మహిళల ఓట్లను లక్ష్యంగా చేసుకుని 15 శాతం మహిళా ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. దేశ పౌరులైన 14 శాతం ఓటర్లను తొలగించడంతో పాటు, Z-Generationకు చెందిన 2 కోట్ల మంది యువ ఓటర్లను నమోదు చేయలేదని వారు తెలిపారు. అలాగే SIR పేరిట 13 కోట్ల ఓట్లను తొలగించిన విషయాన్ని వారు ప్రస్తావించారు.

రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఎన్నికల కమిషన్ దేశ పౌరులకు జవాబుదారీగా ఉండాలని, అధికార పార్టీకి కాదు అని నాయకులు స్పష్టం చేశారు. పారదర్శకంగా, జవాబుదారీగా ఎన్నికల కమిషన్ పని చేయాలని సమావేశం కోరింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.అన్వేష్, ఆర్.ఎస్.పి. జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి జయవర్ధన్, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, సీఎంపి నాయకులు రమణయ్య, ఆమ్ ఆత్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, లోక్సత్తా నాయకుడు కృష్ణ, సిపిఐ నాయకులు నాగ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.ఎస్.సాధిక్, ఎం.భాష, సుభాన్ బి, విద్యావంతుల వేదిక నాయకులు మల్లెల భాస్కర్, డాక్టర్ అశోక్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఖాదర్బాషా, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణారెడ్డి, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బమ్మ, ముంతాజ్ బేగం, బుద్ధిష్టి సొసైటీ నాయకులు కుమారస్వామి రెడ్డి, బి.సి. నాయకులు డి.యం.ఓబులేసు, కేశవులు, దళిత ఉద్యమ సీనియర్ నాయకులు రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, పి.చాంద్ బాషా, కె.శ్రీనివాసులు, మండల కమిటీల నాయకులు నరసయ్య, డేవిడ్, సురేష్, గోపాలకృష్ణయ్య, వెంకటే తదితరులు పాల్గొన్నారు.













