రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప వైఎస్ఆర్ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ CITU జిల్లా కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సమగ్ర డిమాండ్ల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.
CITU వివరాల ప్రకారం కడప జిల్లాలో 8 నియోజకవర్గాలు, 40 మండలాల్లో కలిపి సుమారు ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అనేక చోట్ల అమలు కావడం లేదని కమిటీ ఆరోపించింది. ముఖ్యంగా కడప ఇండస్ట్రియల్ ప్రాంతం, కొప్పర్తి వంటి పరిశ్రమల ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది.
రిమ్స్, జిజిహెచ్ వంటి జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు ఇవ్వడం లేదని CITU మండిపడింది. జిల్లాలోని కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై 20 ముఖ్య డిమాండ్లను ప్రభుత్వం ముందుకు ఉంచింది.
అంగన్వాడి, ఆశ, VOA, VRA, మధ్యాహ్న భోజన పథకం, విద్య, వైద్య రంగాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లతో పాటు కాంట్రాక్టు, ఆప్కాస్, గ్రామపంచాయతీ, NHM తదితర కార్మికులకు కనీసం 42 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, వారిని కార్మికులుగా గుర్తించి గ్రాటిటి, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని CITU డిమాండ్ చేసింది.
ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఆప్కాస్, కాంట్రాక్టు, టైం స్కేల్, వై వి, త్రిపుల్ ఐటీ, వెటర్నరీ, ఆర్కిటెక్చర్, AP కార్లు, అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వారందరినీ శాశ్వతం చేయాలని కోరింది. విధుల్లో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, అన్ని విభాగాల్లో అర్హులైన వారికి PF, ESI, వీక్లీ ఆఫ్ వంటి హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేసింది.
జిల్లా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అదనపు కార్మికులకు PF, ESI సౌకర్యాలు, కనీస వేతనాలు కల్పించాలని CITU కోరింది. ఆర్టీపిపి, SPDCL, CPDCL, ట్రాన్స్‌కో , Genco వంటి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ శాశ్వతం చేయాలని డిమాండ్ చేసింది.
అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఆటో, హమాలి, తోపుడు, IML, బిల్డింగ్, షాపింగ్ మాల్స్, గోల్డ్ స్మిత్, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ల కార్మికులకు మౌలిక సౌకర్యాలు, సమగ్ర చట్ట పరిరక్షణ కల్పించాలని కోరింది.
కడప ఇండస్ట్రియల్ ప్రాంతాల్లోని షిర్డీ సాయి తదితర పరిశ్రమలు, కొప్పర్తిలోని Dixon వంటి పరిశ్రమలతో పాటు జిల్లాలోని భారతి , ICL, కోరోమండెల్ , Zuari, దాల్మియా వంటి సిమెంట్ పరిశ్రమల్లో జాయింట్ కమిటీ నిర్ణయించిన ప్రకారం వేతనాలు చెల్లించాలని CITU డిమాండ్ చేసింది. పులివెందుల యురేనియం, బద్వేల్ సెంచరీ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ప్రభుత్వ లేబర్ నిబంధనల ప్రకారం వేతనాలు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని, మహిళా కార్మికులకు రవాణా తదితర సౌకర్యాలు ఇవ్వాలని కోరింది.
కొన్ని పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి ఎక్కువ పని గంటలు పనిచేయించి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, సరైన వసతులు కల్పించడం లేదని CITU ఆరోపించింది. ఇలాంటి చోట్ల విచారణ జరిపి బాధ్యులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో థర్డ్ పర్సన్స్ ద్వారా పనిచేసే వ్యవస్థను, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని CITU కోరింది. ప్రభుత్వం విడుదల చేసే నిధులను కాంట్రాక్టర్లు పూర్తిగా కార్మికులకు చెల్లించకుండా దుర్వినియోగం చేస్తున్నారని, PF, ESI సకాలంలో చెల్లించకుండా, సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది.
ఒకవైపు ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూనే, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 50 సంవత్సరాలు దాటిన శానిటేషన్ కార్మికులను తొలగించడం తగదని, వారిని కొనసాగించాలని CITU డిమాండ్ చేసింది.
జిల్లాలో అక్రమ బదిలీలు, అకారణ తొలగింపులు జరుగుతున్నాయని, హౌసింగ్ డిపార్ట్మెంట్లో 9 మంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 120 మంది శానిటేషన్ మహిళా కార్మికులను తొలగించారని CITU ఆరోపించింది. చిన్న స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరింది.
సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్లు ఎత్తివేసి, కేసులను రద్దు చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని CITU డిమాండ్ చేసింది. కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని కోరింది.
ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసి, వాటిని ప్రైవేటీకరించకూడదని CITU స్పష్టం చేసింది. ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేసి, తగిన నిధులు కేటాయించాలని, ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరింది.
రైతాంగ సమస్యలను పరిష్కరించి, వాటికి అనుసంధానంగా ఉన్న యార్డ్, సెక్యూరిటీ తదితర కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని CITU డిమాండ్ చేసింది. లేబర్, ESI, PF సంస్థలను పటిష్టం చేసి, జిల్లాలో ESI హాస్పిటల్ నిర్మించాలని కోరింది.
జిల్లాలో కార్మికుల స్థితిగతులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, RTC గ్యారేజీలు, డిపోలలో పనిచేస్తున్న స్వీపెంగ్ , వాషింగ్ , బస్సు అటెండర్స్, సెక్యూరిటీ, ఆఫీసులు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అన్ని రకాల అటెండర్స్, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని CITU విజ్ఞప్తి చేసింది. తక్కువ వేతనాలు ఇస్తున్న కాంట్రాక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని CITU డిమాండ్ చేసింది. జిల్లాలో రెగ్యులర్ లేబర్ అధికారులను నియమించాలని కూడా కోరింది.
ఈ విజ్ఞప్తిపై CITU జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మీదేవి, జిల్లా కోశాధికారి వెంకటసుబ్బయ్య సంతకాలు చేశారు.













