రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీపీఐ సీనియర్ నాయకుడు, ఎర్ర సూర్యుడు గా పేరుగాంచిన కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించినట్లు సమాచారం.
ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను నిన్న విజయవాడలోని Andhra Hospital కు తరలించి చికిత్స అందించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు ఆయనను విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలించినట్లు తెలిసింది.
హైదరాబాద్లో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో గుజ్జల ఈశ్వరయ్యకు చికిత్స కొనసాగుతోంది. హార్ట్ స్ట్రోక్ నేపథ్యంలో అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తూ, పరిస్థితిని వైద్యులు నిశితంగా గమనిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితిపై సీపీఐ కార్యకర్తలు, అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై తాజా సమాచారం కోసం పార్టీ నాయకులు, అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో కూడా పార్టీ శ్రేణులు విచారంతో కనిపిస్తున్నాయి.
గుజ్జల ఈశ్వరయ్య ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వైద్య బృందం సూచనల మేరకు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆసుపత్రిలోనే మకాం వేసినట్లు సమాచారం.
సుదీర్ఘకాలంగా వామపక్ష రాజకీయాల్లో చురుకుగా ఉన్న గుజ్జల ఈశ్వరయ్యకు హార్ట్ స్ట్రోక్ రావడం సీపీఐ శ్రేణుల్లో ఆందోళనకు దారితీసింది. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.













