రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కడప జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా నైట్ పెట్రోలింగ్‌ను పోలీసులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు రాత్రి సమయంలో విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులు, కాలనీలు, వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. రాత్రి పూట సంచరించే అనుమానితులపై పోలీసులు కళ్లుగప్పకుండా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఖాళీగా ఉన్న ఇళ్ల చుట్టూ గస్తీ బలగాలను పెంచారు. దీర్ఘకాలంగా మూసి ఉన్న ఇళ్ల వివరాలు సేకరించి, ఆ ప్రాంతాల్లో అదనపు గస్తీ ద్వారా చోరీలు, దొంగతనాలు వంటి నేరాలను ముందస్తుగా అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు.
పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారి కార్యకలాపాలను దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే సంబంధిత పోలీసు స్టేషన్ల పరిధిలో వారి వివరాలను తిరిగి పరిశీలిస్తూ, నేరపూరిత చర్యలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
మొబైల్ చెక్ డివైస్‌ల సహాయంతో రాత్రి పూట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరించే వాహనాల వివరాలను సేకరించి, వారి గుర్తింపు, ప్రయాణ లక్ష్యం, తీసుకెళ్తున్న సామగ్రి వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, ముఖ్య గ్రామాల్లో ఉన్న లాడ్జిల్లో కూడా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. లాడ్జిల్లో బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు పత్రాలు పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
లాడ్జిల్లో అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక సమావేశాలు, చట్టవిరుద్ధ లావాదేవీలపై కఠిన నిఘా పెట్టి, ఎలాంటి నేరపూరిత చర్యలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నైట్ పెట్రోలింగ్ ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెంపొందడంతో పాటు, నేరాల నియంత్రణకు ఈ చర్యలు తోడ్పడుతున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.













