రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా పరిధిలో నేరాలను అరికట్టేందుకు, ప్రజల భద్రతను బలోపేతం చేయేందుకు పోలీసు శాఖ మరింత కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ సూచించారు. మైదుకూరు, రాజంపేట పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశాల్లో ఆయన పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మిని కాన్ఫరెన్స్ హాల్‌లో మైదుకూరు, రాజంపేట సబ్-డివిజన్ పోలీస్ అధికారులతో వేర్వేరు నేర సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాలను నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, నేరాలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్.పి ఆదేశించారు. విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ఎర్ర చందనం అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ తరహా అక్రమ రవాణా కేసులపై కఠిన చర్యలు తీసుకుని, నెట్‌వర్క్‌ను ఛేదించేలా దర్యాప్తు జరపాలని సూచించారు.
మహిళా భద్రత అంశంపై గ్రామాలు, కాలనీలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్.పి సూచించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో చైతన్యం పెంచేలా పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
స్కూళ్ళు, కాలేజీలలో సోషల్ మీడియా వల్ల మహిళలు, బాలికలకు కలిగే వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా భద్రత పై గ్రామాలు, కాలనీలలో, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
స్మార్ట్ పోలీసింగ్ సూచికలైన CEIR, ఈ-సాక్ష్య, CCTNS, ఈ-సమ్మన్స్, ఈ-ప్రాసిక్యూషన్స్ వంటి మాడ్యూల్స్‌పై పట్టు పెంచుకుని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఎస్.పి సూచించారు. సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించి కేసుల దర్యాప్తు, నేర నియంత్రణను మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిని పూర్తిగా అరికట్టాలని, ఈ తరహా కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్.పి పోలీసు అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై కూడా ఎస్.పి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రమాదాలు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు దారితీసే కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, అధిక వేగం తో వెళ్లే వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. వాహనాల రికార్డులు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.













