రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛిత ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలకు దారితీసే సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. గత ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానితులపై నిరంతర నిఘా ఉంచి నివారణ చర్యలు (Preventive Measures) చేపట్టాలని ఆదేశించారు.
గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామసభలు, కార్డన్ అండ్ సర్చ్, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై జిల్లా బహిష్కరణ, పి.డి యాక్ట్ అమలు చేయాలని, అవసరమైన సందర్భాల్లో బైండోవర్ చర్యలు, ముందస్తు అరెస్టులు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
అక్రమ మద్యం, నగదు, ఇతర ప్రలోభాల పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమ ఆయుధాల రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ గ్రామాలు, పట్టణాల్లో రూట్ మార్చ్‌లు, ఫ్లాగ్ మార్చ్‌లు, విస్తృత పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిఘా కొనసాగించాలని సూచించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు, వదంతుల వ్యాప్తిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, రూట్ మ్యాప్‌లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద నిఘా పటిష్టం చేసి, అత్యాధునిక సి.సి కెమెరాల వ్యవస్థ ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలోని కమాండ్ అండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) శ్రీ కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్, కడప డి.ఎస్పీ శ్రీమతి టి. భవాని, పులివెందుల డి.ఎస్పీ మురళి నాయక్, ప్రొద్దుటూరు డి.ఎస్పీ బాలస్వామి రెడ్డి, రాజంపేట డి.ఎస్పీ వెంకట రామయ్యతో పాటు సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.













