రాయలసీమ న్యూస్, కడప: కడప నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డులో బయో మైనింగ్ ప్రక్రియ, వేస్ట్ టు ఎనర్జీ (WTE), ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ISWM) ప్లాంట్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం గార్గేయపురం డంప్‌యార్డులో పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు వినాయక ఘాట్ వద్ద సీసీ రహదారి, ప్యాచ్ వర్క్ పనులను కమిషనర్ పరిశీలించారు. వినాయక నిమజ్జనం నాటికి వినాయక ఘాట్‌ను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలని, అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జోహరాపురం రోడ్డులో ఈ-ఆటోల పార్కింగ్, చార్జింగ్ సౌకర్యాలు, గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ పాయింట్ల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా గార్గేయపురం, జోహరాపురం డంప్‌యార్డుల్లో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా రిమీడియేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రాసెసింగ్ చేసిన వ్యర్థాలు చివరి దశలో ఉన్నందున వాటిని త్వరితగతిన తరలించి, డంప్‌యార్డులో ఖాళీ అవుతున్న ప్రదేశాన్ని తదుపరి వ్యర్థాల నిర్వహణ అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

బయో మైనింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, ప్రాసెసింగ్ చేసిన వ్యర్థాలను త్వరగా తరలించాలని గుత్తేదారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెత్త డంపింగ్‌కు శాశ్వత పరిష్కారం చూపుతూ, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో గార్గేయపురం డంప్‌యార్డులో 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో రూ.330 కోట్ల వ్యయంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన వివరించారు.

ప్లాంట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత గుత్తేదారులను కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా ఆధునిక వ్యర్థాల నిర్వహణలో భాగంగా 9.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.8 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 200 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసి, పునర్వినియోగానికి అనుకూలంగా మార్చే విధంగా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ వ్యర్థాల నిర్వహణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులకు సూచించినట్లు సమాచారం.













