మురుగు నీటి ముప్పులోకి కడప

స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం

కడప నగర ప్రజలను తాగునీటి విషయంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నదిలోకి నేరుగా మురుగు నీటిని కలుపుతూ, అదే నదీ జలాలను శుద్ధి లేకుండానే తాగునీటిగా సరఫరా చేస్తున్న వ్యవస్థపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

మైలవరం జలాశయం నుంచి పెన్నా నదిలోకి నీటిని వదిలిన ప్రవాహమని కనిపిస్తున్న నీరు, వాస్తవానికి నగర మురుగునీటేనని స్థానికులు చెబుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీటిని బుగ్గవంకతో పాటు ఇతర ప్రవాహ మార్గాల ద్వారా దిగువకు తరలించి, ప్రత్యేక కాలువ తవ్వి పెన్నా నదిలో కలుపుతున్నారు. ఈ మురుగులో సాధారణ చెత్తతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, జంతు కళేబరాలు, జీవ సంబంధిత వ్యర్థాలు, ప్రమాదకర రసాయనాలు కలిసిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

కడప నగరానికి తాగునీటిని అందించే ప్రధాన వనరు గండి వాటర్‌ వర్క్స్‌. ఇక్కడే పెన్నా నదిలో మురుగు నీరు కలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గండి వాటర్‌ వర్క్స్‌ నుంచి రోజుకు సుమారు 15 నుంచి 20 ఎంఎల్‌డీ నీటిని, లింగంపల్లి వాటర్‌ వర్క్స్‌ నుంచి 30 నుంచి 35 ఎంఎల్‌డీ నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. లింగంపల్లి వద్దకు చేరే నదీ జలాల్లో ముందుగానే మురుగు కలిసిపోతుండటం వల్ల కాలుష్య భయం మరింత పెరుగుతోంది. అయితే మురుగు నీరు నదిలో కలిసిన తర్వాత ఇసుకలోకి ఇంకి సహజంగానే శుద్ధి అవుతుందని, నదిలో ఏర్పాటు చేసిన బావుల ద్వారా ఉపరితలానికి దిగువనుండే నీటిని ఎత్తుకుంటున్నందున కాలుష్యానికి అవకాశం లేదని కొంతమంది అధికారులు వాదిస్తున్నట్లు సమాచారం. ఈ వాదనపై పర్యావరణ ప్రేమికులు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మురుగు నీటిని నేరుగా నదిలో కలపకుండా శుద్ధి చేయడానికి ప్రభుత్వం ఎస్‌టీపీలు నిర్మించాలనే నిర్ణయం తీసుకుంది. కడప నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.