కడపలో వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా పేదలకు భూ పంపిణీ అమలు చేయాలని డిమాండ్

కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పంపిణీ అమలు చేయాలని, భూ కబ్జాదారుల భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కడప జిల్లాలో భూమిలేని నిరుపేదలకు, ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న పేదలకు గత 12 సంవత్సరాలుగా భూ పంపిణీ అమలు చేయలేదని సంఘం నాయకులు ఆరోపించారు.

జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జి శివకుమార్, ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు, రైతులు పాల్గొన్నారు. పేదలకు భూ పంపిణీ అమలు చేయాలని, అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని, భూ కబ్జాదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జి శివకుమార్, వి అన్వేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకు 14 సంవత్సరాలుగా పేదలకు భూ పంపిణీ అమలు కాలేదని పేర్కొన్నారు. టిడిపి, వైసిపి, ప్రస్తుత కూటమి పరిపాలనలో భూ పంపిణీ చేస్తామని వాగ్దానాలు చేసినప్పటికీ, పాలక వర్గ ఆచరణలో చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు.

కాశి నాయన మండలం నాయనపల్లె రెవెన్యూ పొలంలో సర్వే నంబర్లు 129, 130, 217లో వందల ఎకరాల భూములను వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి సోదరులు పెద్ద ఎత్తున కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ యంత్రాంగం, పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.

కాసినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి కోడూరు, బ్రహ్మంగారిమఠం, అట్లూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో వైసీపీ, టిడిపి ప్రభుత్వాల హయాంలో రాజకీయ నాయకులు, రాజకీయ పలుకుబడి కలిగిన ధనవంతులు లక్షల ఎకరాల భూములను భూ మాఫియా రూపంలో కబ్జా చేశారని సంఘం నేతలు ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ఏడాది క్రితం రెవెన్యూ సదస్సులు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి అన్ని మండలాల్లో అట్టహాసంగా సమావేశాలు నిర్వహించినప్పటికీ, భూ కబ్జాదారుల నుంచి ఒక్క ఎకరం భూమినీ స్వాధీనం చేసుకోలేకపోయిందని వారు విమర్శించారు. ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు భూ కబ్జాదారుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వెంటనే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని, గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు స్వప్నమ్మ, సరస్వతి, కోనేటి నరసయ్య, సురేష్ బాబు, ఈ రమణయ్య, వరికుంట్ల బాబు, డేవిడ్ రాజ్, శేఖర్, అరవింద్, గుర్రమ్మ, పుష్పమ్మ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు పెసల రఘు, కార్యదర్శి బండి జకరయ్య తదితరులు పాల్గొన్నారు.