రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప మునిసిపల్ కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం వ్యవహారాలు శ్రుతిమించుతున్నాయంటూ ఒక గిరిజన కుటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది. కార్పొరేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్‌లో తమ నివాస గృహ నిర్మాణంపై అడిషనల్ కమిషనర్ జోక్యం చేసుకోవడంతో కుటుంబం కమిషనర్, SP, కలెక్టర్‌లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ప్రకాష్ నగర్‌లో గిరిజన కుటుంబం అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత భవన నిర్మాణం ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిర్మాణానికి సంబంధించి కోర్టులో కేసు ఉన్నప్పటికీ, చట్టబద్ధ అనుమతులతోనే పనులు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. అయితే, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం తమకు కావాల్సిన తాయిలాలు అందలేదనే కారణంతో సచివాలయ సిబ్బందిని ఒత్తిడి చేసి, నిర్మాణాన్ని ఆపించాలని ప్రయత్నిస్తున్నారని కుటుంబం ఆరోపించింది.
నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ అనుమతి సరిపోదని, తన అనుమతి తప్పనిసరి అని అడిషనల్ కమిషనర్ హుకుం జారీ చేసినట్లు కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం కోరిన డబ్బు తమకు ఇవ్వడం సాధ్యం కాదని, డబ్బు తప్పనిసరిగా ఇవ్వాలనే పరిస్థితి వస్తే కిడ్నీ ఇచ్చే స్థితికి చేరుకున్నామని కుటుంబం కమిషనర్‌కు విన్నవించినట్లు సమాచారం. తమ సమస్యను పరిష్కరించకపోతే కుటుంబంతో సహా కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు పాల్పడతామని కూడా కమిషనర్‌కు తెలియజేసినట్లు కుటుంబం పేర్కొంది.
అడిషనల్ కమిషనర్ ఆగడాలను కమిషనర్ అదుపులోకి తీసుకుంటారా, లేక అడిషనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గిరిజన కుటుంబాన్ని ఊరి బయటకు పంపించే పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతోంది.
అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం చర్యలపై S.T కమిషన్‌కు కూడా గిరిజన కుటుంబం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.













