రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న డాగ్ స్టెరిలైజషన్ సెంటర్ ను కార్పొరేషన్ కమిషనర్ Dr. P. భవాని ప్రసాద్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలు, శస్త్రచికిత్సల వివరాలు, రికార్డుల నిర్వహణపై కమిషనర్ సమగ్రంగా సమీక్ష చేపట్టారు.
తనిఖీ సందర్భంగా కేంద్రంలో నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల రికార్డులను కమిషనర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని కుక్కలపై శస్త్రచికిత్సలు నిర్వహించారో, రోజువారీగా ఎన్ని శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో, వాటికి సంబంధించిన వివరాలు ఎలా నమోదు చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రంలో ఉన్న రికార్డు పుస్తకాలు, రిజిస్టర్లు, ఇతర పత్రాలను పరిశీలించిన కమిషనర్, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం స్టెరిలైజషన్స్ సంఖ్య, వాటి తేదీలు, కుక్కల వివరాలు, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ విధానాలపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు.
మలేరియా డిపార్ట్మెంట్ అధికారులతో పాటు సంబంధిత సిబ్బందితో కమిషనర్ సమావేశమై, కుక్కల శస్త్రచికిత్స ప్రక్రియను సమీక్షించారు. పట్టణంలో తిరుగుతున్న వీధి కుక్కల నియంత్రణ కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు, వాటి ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో చర్చించారు.
కుక్కల శస్త్రచికిత్స కార్యక్రమాన్ని వ్యవస్థబద్ధంగా, నిర్ణయించిన నియమాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా కచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతి శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను పూర్తిగా, స్పష్టంగా నమోదు చేసి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
పట్టణంలో వీధి కుక్కల సమస్యను సమర్థవంతంగా నియంత్రించేందుకు మరింత ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కీలక సూచనలు చేశారు. శస్త్రచికిత్స కార్యక్రమం అమలు, పర్యవేక్షణను బలోపేతం చేసి, కార్యక్రమం పురోగతిని నిరంతరం సమీక్షించాలన్నారు.
డాగ్ స్టెరిలైజషన్ సెంటర్ కార్యకలాపాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి, పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి.













