రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: కడపలో గంజాయి అక్రమ రవాణా కేసులో ఎక్సైజ్ అధికారులు 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
కడప ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు కమిషనర్ వివరాలు వెల్లడించారు. ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న సమాచారం ఆధారంగా ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. తనిఖీల సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
తరువాత వాహనాన్ని పరిశీలించగా ప్లాస్టిక్ సంచిలో దాచిన 9 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం, నిందితుల వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు.
విచారణలో భాగంగా నిందితులను ప్రశ్నించగా, కిలోకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు బయటపడిందని అదనపు కమిషనర్ తెలిపారు. ఇప్పటికే ఒక కిలో గంజాయిని విక్రయించారని, మిగిలిన 9 కిలోలను తరలిస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నట్లు వివరించారు.
ఈ కేసులో నిందితుడైన సతీష్ చంద్రపై గతంలోనూ గంజాయి సంబంధిత కేసులు నమోదైనట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.













