రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప:- ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. జూన్ నెల ప్రారంభమై వారం గడిచినా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో జిల్లా ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పగటి వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి వేళల్లో విపరీతమైన ఉక్కపోతతో జనజీవనం దెబ్బతింటోంది.
మే నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ నెలలో సగం రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కి పైగా నమోదు కావడం గమనార్హం. జూన్‌లో అయినా వేడి తగ్గుముఖం పడుతుందని ప్రజలు భావించినా, అదే ధోరణి కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.
ఎండ తీవ్రతను తట్టుకోలేక గృహాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగింది. సాధారణంగా కంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్తు వినియోగం నమోదవుతోంది. హెవీ లోడ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు నియంత్రికలు పేలిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అప్పుడప్పుడూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినప్పటికీ, జిల్లాలో వర్షాలు మాత్రం కురవడం లేదు. వర్షాభావం, ఎండ తీవ్రత కలసి ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. వ్యవసాయ పనులు కూడా ప్రభావితమవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
ప్రస్తుత మాసంలో ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శరీరానికి తగినంత ద్రవాలు అందేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు గుడ్డ కట్టుకోవడం, లైట్ కలర్ దుస్తులు ధరించడం, వీలైనంత వరకు నీడ ప్రాంతాల్లోనే ఉండాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనొప్పి, తల తిరగడం, అధిక అలసట, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు.













