రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు, సన్నద్ధతలను పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లపై ఇప్పటికే దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.
అమరావతి లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, జిల్లాల వారీగా చేపడుతున్న ఏర్పాట్లపై ఈ సమీక్ష సాగింది.
కడప కలెక్టరేట్ లోని బోర్డు సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది సమీకరణ, ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను దశలవారీగా సిద్ధం చేస్తున్న విషయాన్ని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అదనపు సిబ్బందిని కూడా సమకూర్చుకోవాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల సౌకర్యాలు, భద్రతా చర్యలు, లాజిస్టిక్ ఏర్పాట్లు వంటి అంశాలపై కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం తక్షణం అమలు చేయాల్సిన చర్యలపై కూడా సూచనలు ఇచ్చినట్లు తెలియజేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కడప జిల్లా డీఆర్ఓ మల్లికార్జునుడు, ఆర్డీవో మురళి, జెడ్పీ సీఈఓ సుబ్రహ్మణ్యం, డీపీఓ రామచంద్ర, నగర పాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో సూచనలు చేసినట్లు సమాచారం.













