రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లాలో తల్లి మరణాలను పూర్తిస్థాయిలో తగ్గించి, నివారించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో ఆయన అధ్యక్షతన తల్లి మరణాల పర్యవేక్షణ, స్పందనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లాలో ఇటీవల నమోదైన తల్లి మరణాల వివరాలు, వాటికి దారితీసిన కారణాలు, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, వారికి అందిస్తున్న చికిత్స తదితర అంశాలను అధికారులు సమగ్రంగా సమీక్షించారు. గత ఐదు నెలల్లో జిల్లాలో సంభవించిన మాతృ మరణాలపై విపులంగా చర్చించి, లోపాలను గుర్తించి, సరిదిద్దే చర్యలపై దృష్టి సారించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా. శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను సూచించారు. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులను ముందుగానే గుర్తించి, ప్రసవానికి ముందస్తు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను వెంటనే ఉన్నత వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు తరలించేలా పటిష్టమైన రిఫరల్ వ్యవస్థను అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ సేవలు, అత్యవసర వైద్య సేవలు, రక్త నిల్వలు, అవసరమైన మందులు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రతి గర్భిణీకి పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున, PC PNDT సభ్యులు, ICDS PD రమాదేవి, DCHS డా. రఫీక్ బాషా, Immunization అధికారి డా. ప్రవీణ్ కుమార్, RIMS సూపరింటెండెంట్ డా. పెంచలయ్య, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవిబాబు, గైనకాలజిస్ట్ రేఖా రావు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు తమ తమ విభాగాల్లో అమలు చేస్తున్న చర్యలను, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో వివరించారు.













