రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప సెంట్రల్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డి ఈ ఘటనకు కేంద్రబిందువుగా మారాడు. కడప సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న వీరారెడ్డి మరో దొంగతనం కేసు సంబంధంగా PT వారెంట్‌పై రాయచోటి కోర్టుకు తరలించగా, తిరిగి కడపకు తీసుకొస్తున్న సమయంలో పరారైనట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం, మరో దొంగతనం కేసులో విచారణ నిమిత్తం PT వారెంట్‌తో వీరారెడ్డిని రాయచోటికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ పూర్తయ్యాక రాయచోటి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. అనంతరం తిరిగి కడప సబ్ జైలు వద్దకు తరలిస్తుండగా, జైలు లోపలికి తీసుకెళ్లే సమయంలో వీరారెడ్డి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనతో జైలు, పోలీసు వర్గాల్లో కలకలం రేగింది.

రిమాండ్ ఖైదీ పరారైన విషయం తెలిసిన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వివిధ మార్గాల్లో అతని కోసం శోధన చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతికి చేరుకున్న వీరారెడ్డిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను రాయచోటి పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
వీరారెడ్డిని రాయచోటికి తరలించే బాధ్యత రాయచోటి పోలీసులదే. రిమాండ్ ఖైదీని రాయచోటికి చెందిన ఏఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ అయాన్ భాష, హోంగార్డు మధు బాబుకు అప్పగించడంతో, వారు అతన్ని రాయచోటికి తీసుకెళ్లినట్లు సమాచారం. కోర్టు హాజరు అనంతరం తిరిగి కడప సబ్ జైలుకు తీసుకువస్తున్న సమయంలోనే ఈ పరార్ ఘటన చోటుచేసుకుంది.
రిమాండ్ ఖైదీ పరార్ ఘటనపై సంబంధిత అధికారులు నివేదికలు కోరినట్లు, భద్రతా లోపాలపై అంతర్గత విచారణకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖైదీ ఎలా తప్పించుకున్నాడు, ఏ దశలో నిర్లక్ష్యం జరిగిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













