కడప:- విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పోషకాహారాన్ని అందించడంతో పాటు వారిలో క్రమశిక్షణ, పరిశుభ్రత, బాధ్యత, సమైక్యతా భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్న కడప జిల్లా స్మార్ట్ కిచెన్ వ్యవస్థకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జైకా ప్రతినిధుల నుంచి ప్రశంసలు లభించాయి.

బుధవారం చెన్నూరు మండలంలో జైకా టీమ్ లీడర్ యుమికో ఓనిషి, నీతి ఆయోగ్ ఆరోగ్య, పోషణ నిపుణుడు మోహిత్ సూద్ తదితరులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పాల్గొన్నారు.

తొలుత కొండపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలోని స్మార్ట్ కిచెన్‌ను జైకా బృందం సందర్శించింది. అక్కడ ఆహార తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ, భోజనం పాఠశాలలకు తరలింపు విధానం, సమయపాలన, ఉష్ణోగ్రత పర్యవేక్షణ తదితర అంశాలను ప్రతినిధులు సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి స్మార్ట్ కిచెన్ నిర్వహణ విధానాన్ని ఒక్కో విభాగం వారీగా వారికి వివరించారు.

అనంతరం చెన్నూరు మండల కేంద్రంలోని పీఎం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జైకా ప్రతినిధులు పరిశీలించారు. పథకం అమలు విధానం, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, మెనూ రూపకల్పన, పోషకాహార సమతుల్యతపై వారు సమాచారం సేకరించారు.

తరువాత యుమికో ఓనిషి, మోహిత్ సూద్‌తో పాటు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, పలువురు అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు స్మార్ట్ కిచెన్, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత, పోషకాహారంపై రూపొందించిన పోస్టర్లను ప్రదర్శించగా, వాటి విషయాలను జిల్లా కలెక్టర్ స్వయంగా జైకా ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం భోజనం అందించడమే కాకుండా భోజన సమయాన్ని ఒక అభ్యాస ప్రక్రియగా మార్చడమే ఏఎన్‌టీఎస్ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, క్రమపద్ధతిలో భోజనం చేయడం, అవసరమైనంత మాత్రమే వడ్డించుకోవడం, ఆహారాన్ని వృథా చేయకుండా చూడడం, భోజనం అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లను విద్యార్థుల దైనందిన జీవితంలో భాగంగా చేస్తున్నట్లు తెలిపారు.