కడప,: కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలంగా ప్రపంచస్థాయి వసతులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రజత్ కుమార్ సైని పేర్కొన్నారు.

శనివారం కడప సమీపంలోని కొప్పర్తి ఎన్‌ఐసీడీసీ పారిశ్రామిక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ డా. నిధిమీనా, సబ్ కలెక్టర్ హెచ్‌.ఎస్‌. భావనలతో కలిసి రజత్ కుమార్ సైని పరిశీలించారు. పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పనుల పురోగతిని సమీక్షించారు.

వివిధ పనుల ప్రస్తుత స్థితిగతులను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కొప్పర్తి దక్షిణ భాగంలో 2,595.74 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులకు వివరించారు. ప్రపంచస్థాయి పారిశ్రామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానికంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టులోని అన్ని పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రజత్ కుమార్ సైని సూచించారు. కొప్పర్తి పారిశ్రామిక కేంద్రం ద్వారా సుమారు రూ.8,860 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండగా, దాదాపు 54,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మొత్తం రూ.1,006 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 51 కిలోమీటర్ల అంతర్గత రహదారులు, 93 కిలోమీటర్ల వర్షపు నీటి పారుదల వ్యవస్థ, 63 కిలోమీటర్ల తాగునీటి సరఫరా పైపులైన్లు, 15 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అదేవిధంగా 64 కిలోమీటర్ల మురుగునీటి తరలింపు వ్యవస్థ, 2 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రం, 2 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఉమ్మడి వ్యర్థజల శుద్ధి కేంద్రం, 52 కిలోమీటర్ల విద్యుత్ తీగల మార్గాలు, 220 కేవీ, 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, వంతెనలు, ఇతర అవసరమైన పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు.

పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన ప్రతి పనిని సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రాజెక్టు లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేలా చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ సైని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో మురళి, ఏపీఐఐసి డిప్యూటీ జెడ్ఎం కమలాకర్, పరిశ్రమల శాఖ అధికారులు, కొప్పర్తి పారిశ్రామిక వాడలోని వివిధ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.