రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
స్థానిక సంస్థల ఎన్నికలకు సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలి: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లోని సభాభవన్లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, కేఎంసి కమిషనర్ భవానీ ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ శివరామిరెడ్డి, జెడ్పి సీఈవో సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి రామచంద్ర తదితర అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిమిత సమయంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలంటే ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపరిమితికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
పట్టణ స్థానిక సంస్థలు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియలు వరుసగా, కొన్ని దశల్లో సమాంతరంగా కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి అధికారి తన విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహనతో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తొలిదశలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, రెండో దశలో మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు, మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 2వ తేదీ వరకు కొనసాగనున్నందున ప్రతి దశకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 14న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన, అక్టోబరు 16న ఎన్నికల అధికారి నోటీసు, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం జరుగుతాయి. అక్టోబరు 18న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, అక్టోబరు 19న నామినేషన్ల పరిశీలన, అక్టోబరు 21న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అక్టోబరు 28న పోలింగ్, అక్టోబరు 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగనుంది.
మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబరు 19న నోటిఫికేషన్, అక్టోబరు 21న ఎన్నికల అధికారి నోటీసు జారీ, నామినేషన్ల స్వీకరణ చేపడతారు. అక్టోబరు 23న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, అక్టోబరు 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరించిన నామినేషన్లపై అక్టోబరు 25, 26 తేదీల్లో అప్పీళ్లు స్వీకరించి పరిష్కరిస్తారు. అక్టోబరు 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడత పోలింగ్ నవంబరు 26న, రెండో విడత నవంబరు 29న, మూడో విడత డిసెంబరు 2న జరగనుంది. జిల్లాలో ఏ ప్రాంతాలను ఏ విడతలో చేర్చాలనే అంశాన్ని సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు.
ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు.
పంచాయతీరాజ్, పురపాలక శాఖల పరిధిలో ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటి ప్రకటన, వివిధ పదవులకు రిజర్వేషన్ల ఖరారు వంటి ముందస్తు ప్రక్రియలను పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల వార్డులు, సర్పంచ్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాలని సూచించారు.
రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ అధికారులు, పోలీసు శాఖ అధికారులు ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి సహా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ సమయంలో అనుసరించాల్సిన విధానాలు, ఎన్నికల అనంతరం పూర్తి చేయాల్సిన ప్రక్రియలపై అధికారులు స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సిబ్బంది నియామకం, రవాణా, భద్రత, సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఎన్నికల విధులు కేటాయించిన ఆర్వోలు, ఈఆర్వోలు, ఏఏఆర్వోలు తదితర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.













