రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలో దళిత యువకుడు, రిపోర్టర్‌గా పనిచేస్తున్న కురుగాండ్ల చంద్రపై కుల వివక్ష, బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కురుగాండ్ల చంద్ర వివరాల ప్రకారం, ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులానికి చెందిన మాజీ సర్పంచ్ ఏనుగు బ్రహ్మానంద రెడ్డి, దేవాలయం బయట కూడా తాను దేవునికి దండం పెట్టుకోకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. తనను రిపోర్టర్‌గా, మాదిగ యువకుడిగా కులం పేరుతో దూషిస్తూ బెదిరించాడని ఆయన ఆరోపించారు.
దేవాలయం గాలిగోపురం ముందు నుంచి దాదాపు 20 అడుగుల దూరం నుంచే దండం పెట్టుకోవాలని, గుడి బయట దేవునికి నమస్కారం చేయకూడదని ఏనుగు బ్రహ్మానంద రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చినట్లు కురుగాండ్ల చంద్ర పేర్కొన్నారు. ఆచారాలను అతిక్రమిస్తే “మీ అంతు చూస్తాం” అనే స్థాయిలో బెదిరింపులు చేసినట్లు ఆయన ఆరోపించారు.
గ్రామంలో తిరగనివ్వమంటూ, దాడి చేయడానికి కూడా వెనుకాడకుండా దూషణలు, బెదిరింపులు చేసిన ఘటనపై గ్రామంలోని మాదిగలు భయంతో నోరు విప్పలేని పరిస్థితి నెలకొన్నట్లు కురుగాండ్ల చంద్ర తన వర్ణనలో తెలిపారు. అగ్రవర్ణాల భయంతో గ్రామస్థులు స్పందించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏనుగు బ్రహ్మానంద రెడ్డి గతంలో కూడా మాదిగలపై దాడి చేసిన ఘటనలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైనట్లు కురుగాండ్ల చంద్ర గుర్తుచేశారు. తాను గతంలో ఎమ్మార్పీఎస్‌లో పనిచేసిన విషయాన్ని, ప్రస్తుతం ఒక ఛానల్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలో కడప జిల్లా ఎమ్మార్పీఎస్‌తో పాటు అనుబంధ సంఘాలు తనకు మద్దతుగా నిలిచి, మాదిగలను కులం పేరుతో దూషించిన అగ్రకుల వ్యక్తిపై కేసు నమోదు అయ్యేలా, చట్టపరమైన చర్యలు తీసుకునేలా ముందుకు రావాలని కురుగాండ్ల చంద్ర విజ్ఞప్తి చేశారు.













