రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్: ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు
మెగా డీఎస్సీ నియామకాలలో జరుగుతున్న అక్రమాలు సామాన్యులకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ పరీక్షలు రాసిన 3.30 లక్షల మంది అభ్యర్థులతో పాటు సాధారణ ప్రజలకు కూడా మెగా డీఎస్సీలో జరుగుతున్న అవకతవకలు బహిరంగ రహస్యంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే తక్షణమే మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తమపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే, తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలని ఆయన సవాల్ విసిరారు.
ఇదిలా ఉండగా, వైఎస్సార్ జిల్లాలో మెగా డీఎస్సీ నియామకాలపై మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. కుల ధృవీకరణ పత్రాల దుర్వినియోగం, నకిలీ సర్టిఫికెట్ల వినియోగంపై వచ్చిన ఫిర్యాదు జిల్లా విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రసూల్ అనే అభ్యర్థి 2008, 2012, 2018 సంవత్సరాల్లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో BC-E కేటగిరీకి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అయితే 2025 మెగా డీఎస్సీలో మాత్రం అదే రసూల్ OC-EWS కేటగిరీగా నమోదు కావడం అనుమానాలకు తావు కల్పించింది.
ఈ మార్పు కారణంగా తనకు రావాల్సిన ఉద్యోగాన్ని రసూల్ నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో దోచుకున్నాడని జమీల్ అనే అభ్యర్థి అధికారులకు ఫిర్యాదు చేశారు. రసూల్ సమర్పించిన కుల ధృవీకరణ పత్రాలు, గత డీఎస్సీల్లో ఇచ్చిన వివరాలు, ప్రస్తుత మెగా డీఎస్సీలో నమోదు చేసిన కేటగిరీ మధ్య ఉన్న వ్యత్యాసాలను జమీల్ తన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం.
జమీల్ ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. సంబంధిత రికార్డులు, సర్టిఫికెట్లు, అభ్యర్థుల వివరాలను పరిశీలించిన అనంతరం రసూల్ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు విచారణలో నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మెగా డీఎస్సీ నియామకాలలో నకిలీ కుల ధృవీకరణ పత్రాల వినియోగం బయటపడటం, ఇప్పటికే ఉన్న అక్రమాల ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ మొత్తం ప్రక్రియను పునర్విమర్శించాలంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థులు, విద్యా హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.













