రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 14న జరిగిన ఘర్షణ కేసు దర్యాప్తు, అరెస్టుల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరువర్గాలు గాయపడిన ఘటనలో పోలీసులు ఒకే వర్గంపై చర్యలు తీసుకుని, మరో వర్గాన్ని వదిలేయడం పట్ల కమిషన్ మండిపడినట్లు సమాచారం.
ఘర్షణలో పాల్గొన్న ఇరువర్గాలు గాయపడినా, ఒక వర్గానికి మాత్రమే 41ఎ నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ గుర్తించింది. అదే సమయంలో ఎస్టీలకు చెందిన 9 మందిపై కేసులు నమోదు చేయడాన్ని కమిషన్ ప్రశ్నించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే వారిలో ఐదుగురిని అరెస్ట్ చేయడం, మరో వర్గం వారిని అరెస్ట్ చేయకపోవడం పట్ల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం జాతీయ ఎస్టీ కమిషన్ హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే కడప ఎస్పీ విచారణకు హాజరుకాకపోవడంపై కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ వివరణ ఇవ్వకుండా, తాను ఎందుకు విచారణకు వచ్చానని ప్రశ్నించిన పోలీసు అధికారిపై కమిషన్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.
కేసు దర్యాప్తు, అరెస్టుల విషయంలో పోలీసు వ్యవస్థ చూపుతున్న వైఖరిపై కమిషన్ సభ్యులు కఠినంగా స్పందించినట్లు వర్గాలు చెబుతున్నాయి. ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తులపై మాత్రమే కేసులు నమోదు చేసి, మరో వర్గంపై చర్యలు తీసుకోకపోవడం ద్వారా పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం కమిషన్‌లో వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో కడప జిల్లా పోలీసు వ్యవస్థ నుంచి పూర్తి స్థాయి నివేదికను కమిషన్ కోరినట్లు సమాచారం. ఘర్షణకు దారితీసిన కారణాలు, ఇరువర్గాల గాయాల వివరాలు, కేసు నమోదు, అరెస్టుల ప్రక్రియపై సమగ్ర వివరాలు అందించాలని కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది.
డీఎస్పీ మురళీ నాయక్‌పై కూడా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తు, బాధితుల రక్షణ, న్యాయపరమైన చర్యల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించినట్లు వర్గాలు పేర్కొన్నాయి.













