రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
నెల రోజుల్లో వివాహం.. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
కడప:- నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతుందని సంతోషంలో మునిగితేలుతుండగా, రోడ్డు ప్రమాదం ఆ ఆనందాన్ని క్షణాల్లో విషాదంగా మార్చింది. కడప నగరంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో యువతి సయ్యద్ మొహసీనా (18) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె మామ సయ్యద్ అమీనుల్లా తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నగరంలోని నకాష్‌వీధికి చెందిన సయ్యద్ అమీనుల్లా, అతని సోదరి కుమార్తె సయ్యద్ మొహసీనా నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కుటుంబ పెద్దలు మొహసీనాకు మరో నెల రోజుల్లో వివాహం జరిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో శుక్రవారం ఆలంఖాన్‌పల్లె సమీపంలో ఉన్న వారి బంధువుల ఇంట నిర్వహించిన వివాహ కార్యక్రమానికి అమీనుల్లా, మొహసీనా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి తిరిగి కడపకు వస్తుండగా, ఆలంఖాన్‌పల్లె వైపు నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
బస్సు ఢీకొట్టిన ప్రభావంతో మొహసీనా వాహనం నుంచి పడిపడి బస్సు టైర్ కింద ఇరుక్కుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అమీనుల్లా ఎగిరి రోడ్డు పక్కకు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అమీనుల్లాను కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందుతోంది.
అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మొహసీనాను పెళ్లి కూతురిగా చూడాలని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుండగా, ఆమె మృతదేహాన్ని చూసి విలపించారు. “పెళ్లి కూతురిగా చూడాలనుకుంటే.. అప్పుడే నూరేళ్లు నిండాయా” అంటూ బంధువులు, కుటుంబ సభ్యులు రోదించడాన్ని చూసిన స్థానికులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పెళ్లి ముహూర్తం కోసం సిద్ధమవుతున్న ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.













