రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
పెద్ద దస్తగిరి హత్య కేసుతో నాకు సంబంధం లేదు
: మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి
పెద్ద దస్తగిరి హత్య కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైన నేపథ్యంలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. చనిపోయిన పెద్ద దస్తగిరితో ఎలాంటి మనస్పర్థలు లేవని, ఆయన తనకు మంచి మిత్రుడని నిత్యానంద రెడ్డి వ్యాఖ్యానించారు.
తనపై అక్రమంగా కేసు నమోదు చేశారనే ఆరోపణలు నిత్యానంద రెడ్డి చేశారు. 36 రోజులుగా కస్టడీలో ఉన్నానని, ఆ అనుభవం తనకు తీవ్ర బాధ కలిగించిందని ఆయన వెల్లడించారు. తనకు ఎలాంటి క్రిమినల్ నేపథ్యం లేదని, నేరస్థులతో ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
పెద్ద దస్తగిరి హత్య చేసిన వారితో కూడా తనకు ఎటువంటి సంబంధం లేదని నిత్యానంద రెడ్డి తెలిపారు. హత్య నిందితులకు తాను వాహనం, డబ్బులు ఇచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయలేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయానని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అభిమానంతోనే పార్టీ కోసం పనిచేశానని నిత్యానంద రెడ్డి పేర్కొన్నారు. హత్య ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, భయపడవద్దని YS. అవినాష్ రెడ్డి , సతీష్ రెడ్డి , అంజాద్ బాషా , రవీంద్రనాథ్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
తనను ఎవరూ భయపెట్టలేరని, న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని నిత్యానంద రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తాను షరతులతో కూడిన బెయిల్ పై ఉన్నందున కొన్ని విషయాలు వివరంగా చెప్పలేకపోతున్నానని చెప్పారు. న్యాయస్థానంలో తనపై పెట్టిన కేసు విషయంలో చట్టపరంగా పోరాటం కొనసాగిస్తానని నిత్యానంద రెడ్డి స్పష్టం చేశారు.













